శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 మే 2024 (13:48 IST)

క్రికెటర్ల జీవితాలంటే లెక్కలేకుండా పోయింది : రోహిత్ శర్మ

rohith sharma
మీడియాపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. క్రికెటర్ల జీవితాలంటే లెక్కలేకుండా పోయిందని మండిపడ్డారు. ఐపీఎల్ తాజా సీజన్‌‌లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి, కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించడం దారుణంగా కొట్టింది. రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ తరపున ఇదే చివరి సీజన్ అంటూ ప్రచారం జరుగుతుండగా, ఇటీవల తన స్నేహితుడు అభిషేక్ నాయర్‌తో రోహిత్ శర్మ సంభాషణ బయటికి వచ్చింది. జరుగుతున్న ప్రచారానికి ఊతమిచ్చేలా ఆ సంభాషణ ఉంది. 
 
ఈ నేపథ్యంలో, ఐపీఎల్ అధికారిక ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ చానల్‌పై హిట్ మ్యాన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. క్రికెటర్ల జీవితాలంటే లెక్కలేకుండా పోయిందని ఆవేదన వెలిబుచ్చాడు. స్నేహితులతో ముచ్చటిస్తున్నా, సహచర క్రికెటర్లతో మాట్లాడుతున్నా, ప్రాక్టీసు చేస్తున్నా, మ్యాచ్ రోజున కానీ మేం మాట్లాడే ప్రతి మాటను రికార్డు చేస్తున్నారు... కెమెరాలన్నీ మాపైనే ఉంటున్నాయి అంటూ ఆక్రోశించాడు. 
 
'మొన్న ఇలాగే ఒక సంభాషణను రికార్డ్ చేయవద్దని స్టార్ స్పోర్ట్స్‌ను కోరాను... కానీ నా విజ్ఞాపనను పట్టించుకోకుండా ఆ సంభాషణ తాలూకు వీడియోను ప్రసారం చేశారు. ఇది ఖచ్చితంగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే. ప్రత్యేకమైన కంటెంట్ కోసం పాకులాడుతూ, కేవలం వ్యూస్ కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తే, అది ఏదో ఒకరోజున అభిమానులకు, క్రికెటర్లకు మధ్య ఉన్న నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తుంది... ఇకనైనా మంచితనాన్ని నిలుపుకుందాం' అంటూ రోహిత్ శర్మ పిలుపునిచ్చాడు.