బుధవారం, 6 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (14:29 IST)

నిన్న పురుషులు... నేడు మహిళలు.. కివీస్ గడ్డపై సిరీస్ కొట్టేశారు

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇది సోమవారం జరిగింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలివుండగానే గెలుపొందింది. అలాగే, భారత మహిళా క్రికెట్ జట్టు కూడా సిరీస్ కైవసం చేసుకుంది. ఈ పర్యటనలో అద్భుత ప్రదర్శన చేస్తున్న మహిళా క్రికెట్ జట్టు తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. ఈ ఆత్మవిశ్వాసంతో మంగళవారం బరిలోకి దిగింది. 
 
మూడు వన్డేల సిరీస్‌ను రెండో మ్యాచ్‌తోనే గెలుచుకొని స‌త్తా చాటింది. భారత మహిళలు అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో కళ్లు చెదిరే ప్రదర్శన చేయ‌డంతో ఏక‌ప‌క్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చిత్త‌యింది. ఐసీసీ మహిళా చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌ మొదటి మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లతో న్యూజిలాండ్‌ను ఓడించిన భార‌త్‌.. మంగళవారం జ‌రిగిన రెండో మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత క్రికెట్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ జట్టు బ్యాటింగ్ చేపట్టి 44.2 ఓవర్లో 161 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో కెప్టెన్ సాట‌ర్‌వ‌ర్త్ (71) మ‌రోసారి రాణించ‌గా మిగిలిన బ్యాట్స్ఉమ‌న్ అంతా విఫ‌ల‌మ‌య్యారు. దీంతో న్యూజిలాండ్ స్వ‌ల్ప స్కోరుకే ప‌రిమిత‌మైంది. భారత బౌలర్లలో జుల‌న్ గోస్వామి మూడు వికెట్లు తీయగా, బిస్త్‌, దీప్తి శ‌ర్మ‌, పూన‌మ్ యాద‌వ్ రెండేసి వికెట్లు ద‌క్కించుకున్నారు. శిఖా పాండే ఒక వికెట్ ప‌డ‌గొట్టింది.
 
ఆ తర్వాత 162 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... ఆరంభంలోనే న్యూజిలాండ్ బౌల‌ర్లు షాకిచ్చారు. ఓపెన‌ర్ రోడ్రిగ్స్ (0), దీప్తి శ‌ర్మ (8)ను ఆరంభంలోనే అవుట్ చేశారు. దీంతో భార‌త్ 15 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే తొలి మ్యాచ్‌లో సెంచ‌రీ సాధించిన స్మృతి మందాన (90 నాటౌట్‌) మ‌రోసారి కీల‌క ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (63 నాటౌట్‌)తో క‌లిసి భార‌త్‌ను విజ‌య‌తీరానికి చేర్చింది. వీరిద్ద‌రూ మూడో వికెట్‌కు అజేయంగా 151 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యం నెల‌కొల్పడంతో భార‌త్ 35.2 ఓవ‌ర్ల‌లోనే విజ‌య‌కేతనం ఎగుర‌వేసింది. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్ విజేత‌గా నిలిచింది.