శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (15:26 IST)

చెత్త విషయాలు పక్కనబెట్టి భారత ఆటగాళ్ల అద్భత ఆటను ప్రశంసించండి : స్మిత్

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ స్టీవ్ స్మిత్‌కు కోపమెచ్చింది. సిడ్నీ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో తనకు తెలియకుండా జరిగిన ఓ చిన్నపాటి తప్పుపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని కొనియాడారు. వారి ఆటను ప్రశంసించాల్సిందిపోయి చెత్త విషయాలపై చర్చ ఎందుకని ఆయన ప్రశ్నించారు. 
 
సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో పలు వివాదాలు చెలరేగిన విషయం తెల్సిందే. అశ్విన్‌పై నిందలేయడం, రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గార్డ్ మార్క్‌ను చెరిపేశాడంటూ స్టీవ్ స్మిత్‌పై విమర్శలు వచ్చాయి. వీటికి ఆయన సమాధానమిచ్చారు. 
 
తనపై వచ్చిన ఆరోపణలు తనను నిర్ఘాంత పరిచాయని పేర్కొన్నారు. పైగా, తనకు చాలా నిరాశ కలిగిందని అన్నాడు. మామూలుగా పిచ్ వద్దకు వెళ్లి తమ బౌలర్లు ఎక్కడ బంతులు వేస్తున్నారన్న విషయాన్ని గమనిస్తుంటానని, అదేసమయంలో ప్రత్యర్థి ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారన్న విషయాన్ని పరిశీలిస్తానని, తాను అక్కడే ఉండి ఆడితే ఎలా ఉంటుందని పరిశీలించే క్రమంలోనే ఆ ఘటన జరిగిందన్నారు. 
 
తాను అప్రయత్నంగా మిడిల్ స్టంప్‌కు మార్కింగ్ తీసుకున్నానే తప్ప, మరే తప్పు చేయలేదని స్పష్టంచేశాడు. ఇదే సమయంలో ఇండియా ఆటగాళ్లు చేసిన అద్భుత ప్రదర్శనను వదిలేసి, ప్రాధాన్యతలేని ఇంటువంటి విషయాలను పెద్దవి చేసి చూపడం సిగ్గు చేటని అన్నారు.
 
కాగా, స్మిత్ చేసిన పనిని కెప్టెన్ టిమ్ పైన్ సైతం సమర్ధించాడు. స్మిత్ ఆటను చూసిన వారు ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుందని, నిజంగా పంత్ మార్కింగ్‌ను అతను చెరిపివేయలేదని అన్నాడు. తాను మైదానంలో అశ్విన్‌తో వ్యవహరించిన తీరుపై క్షమాపణలు కోరానని గుర్తుచేస్తూనే, తాను కెప్టెన్‌గా విఫలమయ్యానే తప్ప, స్మిత్ చేసిన పనిని వ్యతిరేకించబోనని స్పష్టం చేశారు.