మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 9 మార్చి 2019 (17:07 IST)

ధోనీకి సొంత గడ్డపై అదే ఆఖరి మ్యాచ్.. మహీ అద్భుత రనౌట్‌కు ప్రపంచం ఫిదా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ధోనీ తానేంటో మరోమారు నిరూపించాడు. కంగారూ బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రనౌట్ చేసిన తీరుకు క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఫించ్ అవుట్ తర్వాత బరిలోకి దిగిన వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా మెరుపులు మెరిపించాడు. 31 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 47 పరుగులు చేసినా.. ధోనీ మ్యాజిక్‌తో రనౌట్ కాక తప్పలేదు. 
 
ఆటకు 42వ ఓవర్‌లో కుల్దీప్ వేసిన షార్ట్ బాల్‌ను షాన్ మార్ష్.. షార్ట్‌ కవర్‌లోకి ఆడి సింగిల్ కోసం యత్నించాడు. అక్కడే ఉన్న జడేజా డైవ్ చేసి బంతిని అందుకుని ఆ బంతిని ధోనీవైపు విసిరాడు. అయితే జడేజా విసిరిన బంతి వికెట్ల పక్క నుంచి వెళ్లబోతున్నట్టు గమనించిన ధోనీ చేతిని అడ్డం పెట్టి బంతిని స్టంప్స్ పైకి వికెట్‌గా అద్భుతంగా మళ్లించాడు.
 
జడేజా బంతి విసరడం, ధోనీ దానిని వికెట్ల పైకి మళ్లించిన తీరును చూసిన క్రికెట్ ప్రపంచం ధోనీ నైపుణ్యానికి ఫిదా అయిపోయింది. దీంతో తన అవుట్ పక్కా అనుకున్న మ్యాక్స్‌వెల్ పెవిలియన్ దారి పట్టాడు. 
 
ఇకపోతే.. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు వన్డేలకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ దూరంగా ఉంటున్నాడు. దీంతో స్వదేశంలో ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేనే మహేంద్రసింగ్‌ ధోనీ ఆఖరి మ్యాచ్‌ అని క్రీడా పండితులు అంటున్నారు. ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో ధోనీకి విశ్రాంతినిస్తున్నారు. అతని స్థానంలో యువ వికెట్ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ రిషబ్ పంత్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. దీంతో ప్రపంచ కప్ తర్వాత వన్డేలకు ధోనీ దూరమవుతాడని ప్రచారం సాగుతోంది. 
 
ఆస్ట్రేలియాతో సొంత గడ్డైన రాంచీలో ఆడిన ధోనీ ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశాలున్నాయని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో సొంతగడ్డపై ఆసీస్‌తో మ్యాచ్ ఆఖరాటగా భావిస్తున్నారు. మెగాటోర్నీ ముగిసిన తర్వాత భారత్‌కు స్వదేశంలో ఎలాంటి సిరీస్‌లు లేకపోవడం.. సొంతగడ్డపై ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అవుతుందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీకి ఘనంగా వీడ్కోలు పలుకాలని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది.