1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 23 జూన్ 2019 (10:53 IST)

హ్యాట్రిక్ వీరుడు... ఆ క్రికెట్ తర్వాత ఈ క్రికెటరే...

ఐసీసీ ప్రపంచ కప్ పోటీల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో భారత బౌలర్‌గా మహ్మద్ షమీ రికార్డు పుటలకెక్కాడు. గతంలో భారత పేసర్ చేతన్ శర్మ పేరిట ఈ రికార్డు ఉంది. చేతన్ శర్మ 1987లో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో న్యూజిలాండ్ జట్టుపై వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశారు. తద్వారా ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. 
 
ఇపుడు అంటే 32 యేళ్ల తర్వాత మహ్మద్ షమీ ఈ రికార్డును దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ పోటీల్లో శనివారం భారత్ - ఆప్ఘాన్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆప్ఘాన్ గెలవాలంటే ఆఖరి ఓవర్లో 16 పరుగులు కావాల్సి వుంది. ఈ తరుణంలో బంతిని తీసుకున్న షమీ... తొలి బంతికి ఫోర్ ఇచ్చాడు. రెండో బంతికి పరుగు ఇవ్వని షమీ.. ఆ తర్వాత బంతులకు (3, 4, 5 బంతులు) వరుసగా నబి, ఆప్తాబ్ ఆలం, ముజీబ్ రెహ్మాన్‌లను వరుసగా ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ముఖ్యంగా, ఆఫ్తాబ్, ముజీబ్‌లకు సంధించిన యార్కర్లకు బ్యాట్స్‌మెన్ల నుంచి బదులే లేకుండాపోయింది. 
 
కాగా, గతంలో జరిగిన వరల్డ్ కప్‌లలో హ్యాట్రింగ్ సాధించిన బౌలర్లలో చేతన్ శర్మ తర్వాత సక్లయిన్‌ ముస్తాక్‌ (1999), చమిందా వాస్‌ (2003), బ్రెట్‌లీ (2003), మలింగ (2007), రోచ్‌ (2011), మలింగ (2011), ఫిన్‌ (2015), డుమిని (2015) ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌లు సాధించారు. మళ్లీ ఈ ప్రపంచకప్‌లో షమి ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌ తీసింది కూడా షమినే.