శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 23 జూన్ 2019 (11:49 IST)

వరల్డ్ కప్ : భారత్‌కు చుక్కలు చూపిన ఆప్ఘాన్ స్పిన్నర్లు

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, శనివారం భారత్ - ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినంతపనైంది. చివరకు గుడ్డిలో మెల్లగా విజయం సాధించింది. దీనికి కారణం ఆప్ఘాన్ స్పిన్నర్లు. మొత్తం 50 ఓవర్లకు గాను 32 ఓవర్లు వేసిన ఆప్ఘాన్ స్పిన్నర్లు భారత బ్యాట్స్‌మెన్లను ఓ ఆట ఆడుకున్నారు. 32 ఓవర్లు వేసి 119 పరుగులు ఇచ్చిన స్పిన్నర్లు 5 వికెట్లు తీశారు. 
 
ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అంటే భీకర ఫామ్‌లో ఉన్న భారత బ్యాట్స్‌మెన్లు పరుగులు చేయకుండా కట్టడి చేయడంలో ఆప్ఘాన్ బౌలర్లు అత్యంత కీలక పాత్రను పోషించారని చెప్పొచ్చు. 
 
భారత్‌ 224 పరుగులకే కట్టడి కావడంలో ఆప్ఘాన్ స్పిన్నర్లది కీలక పాత్ర. ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లు ముజీబ్‌ రెహ్మాన్‌, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబి.. పార్ట్‌టైం స్పిన్నర్‌ రహ్మత్‌ షా కలిపి 50 ఓవర్ల ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లు వేయడం విశేషం. 3.5 ఎకానమీతో 119 పరుగులు మాత్రమే ఇచ్చిన వీరు.. 5 వికెట్లు పడగొట్టారు. 
 
ఈ గణాంకాల్ని బట్టే ఆప్ఘాన్ స్పిన్నర్లు బలమైన భారత బ్యాటింగ్‌ను ఎంతగా పరీక్షించారో అర్థమవుతుంది. ఆప్ఘాన్ బౌలింగ్‌ దాడి మొదలైందే స్పిన్‌తో. ముజీబ్‌ రెహ్మాన్‌ కొత్త బంతితో చాలా ప్రభావవంతంగా బౌలింగ్‌ చేశాడు. భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మను బౌల్డ్‌ చేసి భారత్‌ను ఆత్మరక్షణలోకి నెట్టాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ ఆద్యంతం స్పిన్నర్ల హవా నడిచింది.