గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 3 ఆగస్టు 2022 (11:04 IST)

పెళ్లయి 2 నెలలే, భార్యపై అనుమానంతో గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన భర్త

murder
వారికి పెళ్లయి 2 నెలలే అయ్యింది. ఐతే భార్యను కళ్లలో పెట్టుకుని చూసుకోవాల్సిన భర్త అత్యంత దారుణంగా గొడ్డలితో దాడి చేసి హత్య చేసాడు. ఆ తర్వాత తను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

 
పూర్తి వివరాలు చూస్తే... హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన 26 ఏళ్ల హరీశ్‌కి ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గౌరీదేవి పేటకు చెందిన 19 ఏళ్ల పుష్పలీలతో గత జూన్ 17న వివాహం అయ్యింది. ఐతే పెళ్లయి భార్య ఇంటికి వస్తే ఆమెను అపురూపంగా చూసుకోవాల్సిందిపోయి అనుమానంతో చూసాడా భర్త. భార్య ఫోనులో ఎవరితోనో మాట్లాడుతూ... ఎఫైర్ పెట్టుకున్నదని అనుమానం పెంచుకున్నాడు.

 
పుష్పలీల తన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నా... ఎవరితో మాట్లాడుతన్నావ్, వారికి నీకూ ఏంటి సంబంధం అని నిలదీస్తూ గొడవకు దిగడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సోమవారం నాడు పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. నిద్ర పోతున్న భార్య మెడపై గొడ్డలితో దాడి చేసి హత్య చేసాడు. ఆ తర్వాత అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

 
మంగళవారం నాడు ఇరుగుపొరుగువారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు మృతురాలి తల్లిదండ్రులు కటిక పేదరికంలో వున్నారు. కనీసం తమ కుమార్తెను చూసేందుకు బస్సు ఎక్కి వచ్చేందుకు వారి వద్ద డబ్బులు కూడా లేవు. చుట్టుపక్కల వారు అందరూ కలిసి డబ్బులు ఇస్తే... అక్కడి నుంచి బస్సులో వచ్చి విగతజీవిగా పడి వున్న తమ కుమార్తెను చూసి రోదించారు.