మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (12:13 IST)

మళ్లీ ఆడబిడ్డ పుట్టిందనీ కర్కోటకుడిగా మారిన కన్నతండ్రి

మళ్లీ ఆడబిడ్డ పుట్టిందని ఓ కన్నతండ్రి కర్కోటకుడుగా మారిపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన పసిబిడ్డను మద్యంమత్తులో కన్న తండ్రే కసాయిగా మారి కడతేర్చిన ఘటన తీవ్ర విషాదం నింపింది. మూడో సంతానం కూడా ఆడపిల్లే పుట్టిందని ఓ తండ్రి శిశువును నిర్దాక్షిణ్యంగా నేలకు కొట్టి బలితీసుకున్న హృదయవిదారక సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కుమురం భీం జిల్లా మారుమూల గిరిజన గ్రామమైన లైన్‌గూడలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. 
 
కాగజ్‌నగర్‌ గ్రామీణ ఎస్ఐ రామ్మోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్‌ మండలంలోని లైన్‌గూడ పంచాయతీ కేంద్రానికి చెందిన గిరిజన దంపతులు మెస్రం బాపురావు - మనీషా అనే దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. 45 రోజుల కిందట మూడో సంతానంగా మరోమారు ఆడపిల్ల జన్మించింది. ఆడపిల్ల పుట్టిందని అప్పటి నుంచి బాపురావు రోజూ తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. 
 
సోమవారం రాత్రి అతడు బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో మౌనిక, అశ్విని టీవీ చూసేందుకు పక్కింటికి వెళ్లారు. ఇంట్లో మనీషాతో పాటు చిన్నారి ఉంది. భార్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయింది. మత్తులో విచక్షణ కోల్పోయిన బాపురావు మంచంపై నిద్రిస్తున్న పసిపాపను బయటికి తీసుకొచ్చి నేలకు కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. 
 
ఆ తర్వాత సర్పంచి ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. ఆమె ఇచ్చిన సమాచారంతో నిందితుడిని వాంకిడి పోలీసులు అదుపులో తీసుకున్నారు. మంగళవారం కాగజ్‌నగర్‌ గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.