ఆంటీ.. అత్యాచారం అంటే ఏమిటి అని అడిగిన 48 గంటలకే బాలికపై గ్యాంగ్ రేప్
అసోంలో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థినిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అత్యాచారానికి గురైన బాలికకు సంబంధించి హృదయవిదారక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రెండురోజుల కిందట కోల్ కత హత్యాచారం గురించి పేపర్లో చదివిన బాలిక... ఆంటీ రేప్ అంటే ఏమిటి అని అడిగినట్లు ఆమె బంధువు వెల్లడించారు. ఈ ప్రశ్న అడిగిన 48 గంటలకే ఆమెపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడటంపై బాధితురాలు బంధువు ఆవేదన వ్యక్తం చేసారు. బాలికను రక్షించడంలో తను విఫలమైనట్లు ఆమె చింతిస్తున్నారు.
బాలికకు చదువు చెప్పించే స్థోమత లేదని ఆమె తండ్రి సమీప బంధువుల ఇంటికి పంపారు. అక్కడ నుంచి బాలిక ప్రతిరోజూ సైకిల్ పైన వెళ్లి చదువుకుని వస్తోంది. ఈ క్రమంలో రాత్రివేళ ట్యూషన్ ముగియగానే సైకిల్ పైన ఇంటికి వెళ్తున్న బాలికను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా సమీపంలోని చెరువు దగ్గరకు లాక్కెళ్లి అత్యాచారం చేసారు. ఆ తర్వాత బాధితురాలిని వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు.
తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో వున్న బాలికను గమనించిన స్థానికులు ఆమెను రక్షించారు. కాగా దర్యాప్తులో భాగంగా బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని తీసుకుని పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తూ చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయాడు.