శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : ఆదివారం, 10 జూన్ 2018 (13:16 IST)

ఎన్డీయే మిత్రపక్షాలతో కాళ్ళబేరానికి దిగిన మోడీ - షా ద్వయం

సంపూర్ణ మెజార్టీ సాధించడంతో గత నాలుగేళ్లుగా ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పార్టీలను ఏమాత్రం లెక్కచేయని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలతో పాటు ఇతర కమలనాథులు కాళ్లబేరాన

సంపూర్ణ మెజార్టీ సాధించడంతో గత నాలుగేళ్లుగా ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పార్టీలను ఏమాత్రం లెక్కచేయని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలతో పాటు ఇతర కమలనాథులు కాళ్లబేరానికి దిగారు.
 
గత నాలుగేళ్ళకాలంలో దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో ఓటర్లు కమలనాథులకు తేరుకోలేని షాకిచ్చారు. దీంతో మోడీ - షా ద్వయం ఉలిక్కిపడింది. ఫలితంగా దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. 
 
ఇందులోభాగంగా, ఎన్డీయే కూటమిలో ఉన్న మిత్రపక్షాలతో కాళ్ల బేరానికి దిగింది. బలంగా ఉన్న ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగడంతో మిగిలిన మిత్రపక్షాల్లో అంతర్మథనం మొదలైంది. ప్రస్తుతం ఎన్డీయేలో ఉన్న శిరోమణి అకాలీదళ్‌, శివసేన, ఆర్‌ఎల్‌ఎస్పీ వంటి పార్టీలు అసంతృప్తితో ఉన్నాయి. 
 
ఈ పార్టీలన్నీ వివిధ అంశాలతో పాటు మోడీ ప్రభుత్వ పాలనపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి. అప్పటికీ పెద్దగా స్పందించని కమలనాథులు, ఉప ఎన్నికల ఫలితాల దెబ్బతో తేరుకున్నారు. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రంగంలోకి దిగి స్వయంగా చర్చలకు శ్రీకారం చుట్టారు. 
 
శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, అకాలీదళ్‌ ముఖ్యనేతలు ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ను కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ, ఆ ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించినట్లు కనిపించలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని అమిత్ షా.. మిత్రపక్షాలను ప్రసన్నం చేసుకునేందుకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.