దరఖాస్తు కోసం క్యూకట్టిన యువత : గ్రామవాలంటీర్ల విధులేంటి?

grama volunteer
Last Updated: మంగళవారం, 25 జూన్ 2019 (18:18 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా గ్రామ వాలంటీర్ల నియామానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1.84 లక్షల మంది గ్రామ వాలంటీర్ల నియామకం జరుగనుంది. ఇందుకోసం నోటిఫికేషన్ జారీ చేయగా, సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు.

రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో 1,84,498(గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిపి సుమారుగా 4 లక్షల ఉద్యోగాలు)మంది గ్రామ వాలంటీర్లను నియామకం చేపట్టనున్నారు. గ్రామాల్లోని ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ను ప్రభుత్వం నియమించబోతోంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ప్రతి 100 కుటుంబాలకు ఒక వాలంటీరు చొప్పున నియమించనున్నారు. గ్రామ వాలంటీర్ల నియామకానికి 12 జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదల కాగా, ఏ జిల్లాలో ఎంతమంది గ్రామ వాలంటీర్లను నియమించుకోవాలన్న దానిపై ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.

నెల్లూరు జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాలో మొత్తం 1,70,543 వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వెబ్‌పోర్టల్ ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చిని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సూచించారు. అయితే నోటిఫికేషన్ విడుదలైన ఒక్కరోజులోనే 1,47,376 మంది వెబ్ పోర్టల్‌ను సందర్శించినట్లు సమాచారం. gramavolunteer.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

జూన్ 24 నుంచి జూలై 5 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. తర్వాత జూలై 10న అభ్యర్థుల జాబితాను పరిశీలన జరగనుంది. జూలై 11 నుంచి 25 వరకు అభ్యర్థులను ఎంపిక చేసి.. ఆగస్టు 1న జాబితాను ప్రకటించనున్నారు. ఆగష్టు 5 నుంచి 10వ తేదీల మధ్య ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనున్నారు. ఆగష్టు 15 నాటికి పూర్తి స్థాయిలో ఈ వ్యవస్థ అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఇంటర్వ్యూ పద్ధతిలో గ్రామ వాలంటీర్లను ఎంపిక చేస్తామని అధికారులు స్పష్టంచేశారు.

ఈ గ్రామ వాలంటీర్ల ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సేవలను ప్రజల ముగింటకు చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారు. ముఖ్యంగా, రేషన్ కార్డు, కుల ధృవీకరణ, ఆదాయ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ, ఆధార్ కార్డు, వృద్ధాప్య, వితంతు పింఛన్లు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇలా ప్రతి ఒక్క సేవలను గ్రామ వాలంటీర్ల ద్వారా అందించనున్నారు. గ్రామాల్లో వాలంటీర్ల నియామకంతో రేషన్ డీలర్లను తొలగించనున్నారు. రేషన్ సరకులను ప్యాక్ చేసి ప్రతి ఇంటింటికీ వాలంటీర్లే డోర్ డెలివరీ చేస్తారు. అనేక అనేక సేవలను వాలంటీర్లే పూర్తిచేసి పెడతారు.

మరోవైపు, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే యువత అదే గ్రామానికి చెందినవారై ఉండాలి. ఇంటర్‌, లేదా సమాన విద్యార్హత ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌ ఉంటుంది. అందులో 50 శాతం మహిళలు ఉండాలి. 2019 జూన్‌ 30వ తేదీ నాటికి 18సంవత్సరాలు పైబడి 30 సంవత్సరాలలోపు ఉండాలి. దరఖాస్తులను ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.

ఎంపీడీవో ఛైర్మన్‌గా ఎంపీడీవో, తహసీల్దార్‌, ఈవో(పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ) కమిటీ దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేసి వాలంటీర్లను ఎంపిక చేస్తుంది. ఎంపికైన వాలంటీర్లకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన వెంటనే రెండు రోజులు మండల స్థాయిలో శిక్షణ ఇస్తారు. ఆగస్టు 15న ఎంపిక ఉత్తర్వులు అందజేస్తారు. ఆ రోజు నుంచే వారు విధులకు హాజరవుతారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, మండల స్థాయిలో ఎంపీడీవో పర్యవేక్షణలో పనులు చేయాలి. వాలంటీర్‌ పనిచేసే 50 ఇళ్ల యూనిట్‌ను ఎంపీడీవో కమిటీ ఎంపిక చేస్తుంది.దీనిపై మరింత చదవండి :