శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2017 (11:18 IST)

గుజరాత్‌లో 'చావుతప్పి కన్ను లొట్టపోయిన చందం'గా బీజేపీ గెలుపు

గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుపు "చావుతప్పి కన్ను లొట్టపోయిన చందం"గా ఉందని విపక్ష పార్టీల నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుపు "చావుతప్పి కన్ను లొట్టపోయిన చందం"గా ఉందని విపక్ష పార్టీల నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం ఏడు సీట్లు మాత్రమే అధికంగా సాధించిందనీ, అనేక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు ప్రత్యర్థులు ముచ్చెమటలు పోయించారు. 16 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు అతి తక్కువ ఓట్లతో గెలుపొందడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 
 
సోమవారం వెల్లడైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లలో గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ 80, విపక్ష పార్టీల అభ్యర్థులు 3చోట్ల గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు కాలికి బలపం కట్టుకుని తిరిగి మరీ ప్రచారం చేశారు. వీరితో పాటు రాష్ట్ర స్థాయిలో హేమాహేమీలు ప్రచార పర్వంలో మునిగిపోయారు. అయినప్పటికీ 99 సీట్లకే పరిమితమైంది. చివరకు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను కూడా కమలనాథులు అందుకోలేకపోయారు. 
 
బీజీపీ నాయకత్వం గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎన్నెన్నో ఊహల్లో తేలిపోయింది. భారీ మెజారిటీ సాధిస్తామని.. 150 సీట్ల మార్కు చేరితీరుతామని ఊదరగొట్టింది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్‌ ఎన్నికలు యావత్‌ దేశ ప్రజల దృష్టిని అమితంగా ఆకర్షించాయి. ప్రధాని మోడీ పనితీరుకు ఎన్నికల ఫలితాలు అద్దంపడతాయని ఆశించారు. కానీ కమలనాథులు ఆశించినమేర ఫలితాలు రాలేదు. ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తిచేసినా.. కేవలం 99 సీట్లకే పమితమయ్యారు. ఇది కమలనాథులను తీవ్రఅసంతృప్తికి లోనుచేసింది. 
 
ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ గత 22 యేళ్లుగా అధికారంలో ఉంది. గత మూడు ఎన్నికల నుంచి బీజేపీకి సీట్లు తగ్గుతూ వస్తున్నాయి. 2007 ఎన్నికల్లో 117 సీట్లు సాధించిన బీజేపీ 2012లో 115 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడైతే 100 మార్కును కూడా అందుకోలేక పోయింది. 2012 ఎన్నికలతో పోలిస్తే ఈసారి గణనీయంగా 16 సీట్లు తగ్గాయి. 
 
అదేసమయంలో కాంగ్రెస్‌ తన ఫలితాను మెరుగుపరుచుకుంటూ వస్తోంది. 2007లో 59 స్థానాలు సాధించిన కాంగ్రెస్‌.. 2012లో 61 సీట్లలో విజయం సాధించింది. ఈసారి 80 స్థానాల్లో నెగ్గి.. తన స్థానాన్నికొంతవరకు మెరుగుపరచుకుంది. గత ఎన్నికల కంటే ఈసారి 19 సీట్లు ఎక్కువగా కైవసం చేసుకోవడం గమనార్హం. అంటే ఈ విజయం ఖచ్చితంగా బీజేపీకి చావుతప్పి కన్నులొట్టపోయిన చందమేని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.