శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 12 జూన్ 2024 (23:12 IST)

కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను : జనసేన పవన్ ప్రజా సేవ కోసం ప్రతిజ్ఞ

pawan kalyan
సినిమాల్లో హీరోగా నటిస్తే ఆయనకు కోట్ల రూపాయలు పారితోషికం. సౌకర్యవంతమైన జీవితం. కానీ ఇవేవీ తనకు తృప్తినీయలేదని పవన్ కల్యాణ్ ఎన్నోసార్లు చెప్పారు. పవన్ కల్యాణ్ ఏమి చేయాలనుకుంటున్నారన్నది ప్రజలకు అర్థమవడానికి ఇంతకాలం పట్టింది. రాజకీయాల్లోకి వచ్చి దశాబ్ద కాలమైంది. ఐతే హీరోగా తిరుగులేని వ్యక్తి పవన్ కల్యాణ్. ఆయన సినిమా వస్తుందంటే ప్రాంతాలు, కులాలకి అతీతంగా ఆడుతుంది. కానీ పవన్ కల్యాణ్ సినిమాలతో తృప్తి లేదు, ప్రజలకు సేవ చేయాలన్న ప్రగాఢమైన ఆకాంక్ష. 2014లో కూటమి పవన్ సహాయం తీసుకుంది. రెండు పార్టీలను ఏపీలో గెలిపించాడు. రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్లు అయ్యింది. 10 ఏళ్లు పాటు పదవి లేకుండానే గడిచిపోయింది. 2019లో ఒకే ఒక్క స్థానంలో గెలిస్తే, ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైసిపిలో చేరిపోయారు.
 
అలా ఆ సమస్యలతో మొదలై విజయాల పునాదులు వేసుకున్నాడు. క్రమంగా రాజకీయం అంటే ఏమిటో చూపించారు. వైనాట్ 175 అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసిపిని మట్టి కరిపించారు. కనీసం వైసిపికి ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు. అధికార పార్టీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని ప్రారంభం నుంచి చెబుతూ వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఒడిసి పట్టుకోవడంలో తెలుగుదేశం-భాజపాలతో కలిసి సక్సెస్ అయ్యాడు. గత ఎన్నికల్లో 151 సీట్లు తెచ్చుకున్న వైసిపిని చావుదెబ్బ కొడుతూ కూటమికి 164 సీట్లు రావడంలో కీలక పాత్ర పోషించాడు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించారు. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించారు. ఏపీలో ముందుగా ఎవరికివారే పోటీ చేయాలనుకున్నారు. కానీ పార్టీలన్నీ కలిసి పోటీ చేయాలని తెదేపా-భాజపాలను ఒప్పించాడు పవన్ కల్యాణ్.
 
2019 ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం ఎందుకు అయ్యారో, తెలుగుదేశం పార్టీకి అధికారం దక్కకుండా ఎందుకు పోయిందో తెలుసుకుని ఈసారి కూటమిగా వెళితేనే ఫలితాలు వస్తాయని మిత్రపక్షాలకు వివరించారు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన జనసేన 5 ఏళ్ల పాటు ఈ పార్టీ వుంటుందా పోతుందా అని అనుకున్నారంతా. ఐతే 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి తన సత్తా చాటారు పవన్. గుర్తు పెట్టుకో జగన్... నిన్నూ నీ పార్టీని అదఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు, నా పార్టీ జనసేనే కాదు అంటూ సవాల్ విసిరారు.
 
చంద్రబాబు అరెస్టుతో జైలు దగ్గరే పొత్తు ప్రకటన చేసిన పవన్, ఆ తర్వాత కూటమి కట్టినా అందులో ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. కూటమి విజయం కోసం కొన్ని స్థానాలకు త్యాగం చేసి తక్కువ స్థానాలను తీసుకున్నారు. ఎన్ని సీట్లలో పోటీ చేసామన్నది కాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడమే నా లక్ష్యం అని జనసేన కార్యకర్తలకు నచ్చజెప్పారు. పవన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జనసేన నాయకులు ఎందరో విమర్శించారు. భాజపా-తెదేపాలను ఒప్పించడం కోసం తను తీసుకోవాల్సిన 40 సీట్లను త్యాగం చేసి 21 సీట్లకే పరిమితమయ్యారు.
 
పార్టీకి నష్టం కలిగించే చర్య అంటూ పవన్ పైన విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. కానీ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, పార్టీ పటిష్టత కోసం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జనసేన కార్యకర్తలను సముదాయించి ఎన్నికల్లో 21కి 21 స్థానాలను గెలిచి శభాష్ అనిపించుకున్నారు. సహజంగా రాజకీయాల్లో సినీ నటులు నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి నాయకులు తప్పించి కొత్తతరంలో సినీ పరిశ్రమ నుంచి వచ్చి సక్సెస్ అయిన వారు తక్కువ. అలాంటిది దశాబ్దాలుగా కాకలు తీరిన రాజకీయ నాయకులను కూటమిగా జత కట్టించడంలో ఒప్పించి ఏపీలో చరిత్ర సృష్టించారు.
 
పవన్ లేకపోతే కూటమి లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఇంతటి భారీ విజయం లేదు. స్క్రీన్ మీద మాత్రమే పవర్ స్టార్ కాదు ప్రజాక్షేత్రంలో కూడా హీరోనే అని నిరూపించుకున్నారు. వైసిపి ఎక్కడా ఈ ఫలితాలను ఊహించి వుండదు. జగన్ వైనాట్ 175 అంటే, పవన్ వైనాట్ 21 అని నిరూపించారు. సజ్జల జూన్ 9న జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారని చెబితే... జూన్ 12న రాష్ట్ర మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణం చేసి చూపించారు. అలా ఏపీ ఎన్నికల్లో ప్రజల చేత బలమైన విశ్వాసం పొందిన నాయకుడిగా పవన్ కల్యాణ్ నిలిచారు.