శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: బుధవారం, 7 నవంబరు 2018 (14:58 IST)

ఆ సిఎం మనవడికి ఆరేళ్ళు... ఎన్ని కోట్ల ఆస్తులో తెలిస్తే షాకే..?

నిండా ఆరేళ్ళ వయస్సు లేదు. అప్పుడే ఓ కార్పొరేట్ కంపెనీకి షేర్ హోల్డర్ అయిపోయాడు. ప్రభుత్వ అధికారుల మధ్య అల్లారుముద్దుగా పెరుగుతున్నాడు. అడుగేస్తే కందిపోతాడా అన్నట్లుగా తిరుగుతున్నాడు. తక్కువ వయస్సులోనే బిజినెస్ మ్యాగ్నెట్‌గా మారి రికార్డులు బ్రేక్ చేసిన వాళ్లను చూశాం. అయితే ఆల్ టైం రికార్డులు తిరగరాస్తూ ఎపిలో ఓ బుడతడు ఏకంగా కార్పొరేట్ కంపెనీకే ప్రధాన షేర్ హోల్డర్‌గా ఎదిగిపోయాడు. 
 
ఈ ఘనకార్యాలు సాధించిన బుడ్డోడి వయస్సు పట్టుమని ఆరేళ్ళు కూడా ఉండవంటే నమ్మగలరా. కానీ ఇది నిజం. సాక్షాత్తు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముద్దుల మనవడు నారా దేవాన్ష్ గురించే. నెలల బిడ్డ దగ్గరి నుంచి ఆరేళ్ళ వయస్సు వరకు నిత్యం అడపాదడపా మీడియాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ వస్తున్నాడు దేవాన్ష్. అయితే ఇంతకాలం ముఖ్యమంత్రి మనువడుగా, స్టార్ హోదా ఉన్న హీరో బాలక్రిష్ణ మనవడుగా ఉన్న దేవాన్ష్ తాజాగా బిజినెస్‌లో తన సత్తా చాటుతున్నాడు. 
 
ఇదేంటి ఆరేళ్ళున్న బుడతడికి బిజినెస్ ఏంటి అనుకుంటున్నారా. మీరేం అనుకున్నా.. ఇది మాత్రం నిజం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుపబడుతున్న హెరిటేజ్ గ్రూప్‌కు ప్రధాన షేర్ హోల్డర్ దేవాన్షే. 
 
ఇప్పటికే గతంలో మంత్రి నారా లోకేష్‌ ప్రకటించిన ఆస్తుల పరంగా మిగిలిన కుటుంబ సభ్యుల కన్నా నారా లోకేషే ముందు వరుసలో ఉండడం మరో విశేషం. తాజాగా ఆస్తుల పరంగానే కాకుండా మెయిన్ షేర్ హోల్డర్‌గా కూడా తన అంతస్తును చాటుకున్నాడు దేవాన్ష్. ప్రతి సంవత్సరం తన ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నారు చంద్రబాబు. కుటుంబ సభ్యుల్లో అందరి కన్నా తక్కువ ఆస్తి చంద్రబాబుకు మాత్రమే ఉన్నాయి. ఒక అంబాసిడర్, ఒక ఇల్లు తప్ప బాబుకు సొంత ఆస్తులు లేవు. కానీ ఆయన మనవడు మాత్రం 40కోట్ల ఆస్తులతో పాటు కార్పొరేట్ కంపెనీ షేర్ హోల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 
 
అయితే ముఖ్యమంత్రి కుటుంబం ఆస్తులు ప్రకటిస్తున్న నేపథ్యంలో బాబు తనయుడు నారా లోకేష్‌‌కు సాధ్యమైనంత తక్కువగా చూపించాలన్న ఉద్దేశంతోనే వారి ఆస్తులను మనవడు లోకేష్‌ మీద ఎక్కువగా రాసినట్లు తెలుస్తోంది. అనంతరం సిఎం కోడలు మంత్రి లోకేష్‌ భార్య నారా బ్రహ్మిణికి, అలాగే బాబు భార్య భువనేశ్వరి పేరు మీద ఆస్తులు ఉన్నాయి. పేరుకు దేవాన్ష్ షేర్ హోల్డరే అయినా ఆ వ్యవహారాలు చూసేదంతా ఎవరనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
మరోవైపు  బాలక్రిష్ణ కూడా తన ఆస్తులతో పాటు తనపై హెరిటేజ్‌లో ఉన్న షేర్స్‌ను కొంత భాగం మనువడు దేవాన్ష్‌కే రాసేశారు. ఆయనొక్కరే కాదు బాలక్రిష్ణ భార్య వసుంధరా కూడా తన షేర్స్‌ను దేవాన్ష్ పేరు మీద రాశారు. దీనికి కారణం ఉంది. రేపు ఎన్నికల్లో నిలువ ఉన్న చంద్రబాబు, లోకేష్‌, బాలక్రిష్ణ ముగ్గురూ ఎన్నికల అఫిడవేట్‌లో ఆస్తుల ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు పత్రాలలో చూపిస్తే ఒకింత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఇబ్బందులు తప్పాలన్నా వ్యాపార పరంగా రాజకీయాల్లో కొనసాగుతున్న వీరికి వ్యాపారపరంగాను సాంకేతిక సమస్యలు అధిగమించాలన్న తమ ఆస్తులు మరొక బినామీ పేరు మీద ఉండడం తప్పనసరి. 
 
మరోవైపు బిజెపితో పొత్తు తెగదింపులు చేసుకోవడంతో ఆత్మరక్షణలో పడ్డారు చంద్రబాబు. ఒకవైపు తమ పార్టీ నాయకుల వ్యాపార సంస్ధలపైన వరుసపెట్టి ఐటీ దాడులు జరుగుతుండడం సిఎంను కలవరపెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రేపు ఐటీ గురి హెరిటేజ్ మీద పడే అవకాశం ఉందన్న పుకార్లు వస్తున్నాయి. దీంతో ఒక్కదెబ్బతో మూడు పిట్టలన్నట్లు అటు ఆస్తుల ప్రకటనకు, ఇటు ఎన్నికల అఫిడివిట్‌కు మరోవైపు ఐటీ దాడులలో సాంకేతికంగా బయటపడవచ్చని తమ ఆస్తులను మనువడి పేరు మీద రాసినట్లుగా చెప్పుకుంటున్నారు. 
 
ఈ ఉద్దేశంతోనే ఇటు చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్‌, బాలక్రిష్ణ కూడా సాధ్యమైనంతగా తమ పేరు మీద ఉన్న ఆస్తులను తక్కువ చేసి చూపేందుకు ఇలా చేస్తున్నారన్న వాదనలు లేకపోలేదు. ఏదిఏమైనా ఆరేళ్ళ చిరు ప్రాయంలోనే కోట్ల ఆస్తులతో పాటు హెరిటేజ్ లాంటి కంపెనీల్లో షేర్ హోల్డర్‌గా కూడా రికార్డులకెక్కి తన ప్రత్యేకతను చాటుకున్నాడు దేవాన్ష్. ఎంతైనా ముఖ్యమంత్రి మనవడు కదా...