శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: శుక్రవారం, 14 డిశెంబరు 2018 (20:39 IST)

టిటిడి, ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు... రమణదీక్షితులు మళ్లీ ప్రధాన అర్చకులవుతారా?

హైకోర్టులో ఎపి ప్రభుత్వానికి, టిటిడికి జాయింట్‌గా భారీ ఎదురుదెబ్బ తగిలింది. అర్చకులు రిటైర్మెంట్ పైన టిటిడి నిర్ణయాన్ని తప్పుబడుతూ రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం తీర్పునిచ్చింది. తొలగించిన అర్చకులను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని స్పష్టం చేయడంతో టిటిడితో పాటు ఎపి ప్రభుత్వానికి కొత్త చిక్కువచ్చి పడినట్లయ్యింది. 
 
ఈమధ్య కాలంలో వరుసగా వివాదాలను ఎదుర్కొంటున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. గతంలో 65 యేళ్లు దాటాయన్న సాకుతో ఎన్నడూ లేని విధంగా వంశపారంపర్య అర్చకులను రిటైర్మెంట్ పేరుతో సాగనంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తి. నిబంధనలకు విరుద్ధంగా అర్చకులను రిటైర్మెంట్ ఇవ్వడం సరికాదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. వెంటనే తొలగించిన అర్చకులను విధుల్లోకి తీసుకోవాలంటూ తీర్పునిచ్చారు. 
 
ఒక రకంగా ఈ తీర్పు టిటిడి కన్నా ఎపి ప్రభుత్వానికే చెంప పెట్టులాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం ఒక వ్యక్తిపై ఉన్న కక్ష కారణంగా ఏకంగా టిటిడి అర్చకులకే రిటైర్మెంట్ వయస్సు నిర్ధారించడం గతంలోనే కలకలం రేపింది. గతంలో టిటిడి ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆలయ వ్యవహారంలోని లోపాలపై టిటిడితో పాటు ఎపి ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వ పెద్దలు ఆయనపైన చర్యలు తీసుకోవడానికి నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగా ఒక్క రమణదీక్షితులపై ప్రతీకారం కోసం ఏకంగా టిటిడి అర్చకులకే రిటైర్మెంట్ వయస్సు ప్రకటించేశారన్న ఆరోపణలు వచ్చాయి. 
 
ప్రభుత్వాన్ని విమర్శించిన రోజుల వ్యవధిలోనే రమణదీక్షితులతో పాటు 65 యేళ్ళకు పైబడిన ఇతర అర్చకులను తొలగిస్తూ ప్రభుత్వ ఒత్తిడితో టిటిడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒక్కసారిగా వ్యవహారం టిటిడిలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పలు అర్చక సంఘాల, బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టాయి.
 
తన నిర్ణయాన్ని టిటిడి వెంటనే ఉపసంహరించుకోవాలని కోరాయి. అయితే ఈ నిర్ణయంపై ఎపి ప్రభుత్వం మెట్టు దిగలేదు. అయితే కేవలం టిటిడిలో అర్చకులకు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించడం మరో వివాదానికి దారితీసింది. దేవదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్న అర్చకులకు రిటైర్మెంట్ వయస్సు ప్రకటించకుండా కేవలం టిటిడి అనుబంధ ఆలయాల్లో పనిచేసే అర్చకులకు మాత్రమే ఈ నిబంధన వర్తింపజేయడం సరికాదన్న వాదనలు వచ్చాయి. 
 
అయితే ఎపి ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. అనుకున్నదే తడువుగా టిటిడిపై ఒత్తిడి తీసుకువచ్చి 65 యేళ్ళు పైబడి ప్రతి ఒక్కరిని తొలగించడంతో పాటు ఆఘమేఘాల మీద నూతన అర్చకులను వారి స్థానంలో నియమించడం జరిగింది. అయితే ఎపి ప్రభుత్వ నిర్ణయంపైన టిటిడి ప్రధాన అర్చకులు కొందరు సమూహంగా ఏర్పడి ఇప్పటికే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా పలు పిటిషన్లను దాఖలు చేశారు. 
 
ఎట్టకేలకు హైకోర్టు నుంచి అర్చకులకు సపోర్ట్‌గా తీర్పు రావడం ఎపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసినట్లయ్యింది. అయితే తాజా తీర్పు నేపథ్యంలో మళ్లీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు టిటిడి సిద్ధపడుతోంది. అయితే గతంలో టిటిడి మిరాశీ అర్చకత్వం పైన న్యాయస్థాన ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించే అవకాశం ఉందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. అదేగనుక జరిగితే ఎపి ప్రభుత్వంతో పాటు టిటిడి ప్రతిష్ట జాతీయస్థాయిలో పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే టిటిడి అర్చకుల తొలగింపుపై రాజకీయ దుమారం కూడా రేగుతోంది. 
 
పలు ప్రతిపక్ష పార్టీలతో పాటు టిటిడి ఈఓలుగా పనిచేసిన మాజీ ఐఎఎస్‌లు సైతం ఎపి ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన సంధర్భాలు ఉన్నాయి. దీంతో వారిపైన టిటిడి కోర్టులో కేసు వేయడం, దాని కోసం కోట్లాది రూపాయల నిధులను వెచ్చించడం కూడా తెలిసిందే. ఈ తతంగం కూడా విమర్శల పాలైంది. తాజాగా హైకోర్టు తీర్పుతో వెంటనే సదరు ఆదేశాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రమణదీక్షితులతో పాటు తొలగించిన ఇతర అర్చకులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాల్సిన సంకట పరిస్థితుల్లో టిటిడి పడిపోయింది. మరి ప్రస్తుతమున్న ఈ సందిగ్థ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఇటు ప్రభుత్వంతో పాటు అటు టిటిడి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. తొలగించిన అర్చకులను విధుల్లోకి తీసుకుంటుందా లేదో వేచి చూడాల్సిందే.