శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (12:03 IST)

మురళీ మోహన్‌కు ఏమైంది? రంజుగా రాజమహేంద్రవరం రాజకీయాలు

సినీనటుడు, రాజమండ్రి ఎంపీ కె.మురళీమోహన్‌కు ఏమైందో ఏమోగానీ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని తేల్చి చెప్పేశారు. అంతేనా.. తన కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా ఎన్నికల్లో పోటీ చేయరన్నారు. ఒక సిట్టింగ్ ఎంపీ తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తారు. కానీ, మురళీమోహన్ మాత్రం అలా కోరుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టంచేశారు. ఇది తూర్పుగోదావరి టీడీపీలో కలకలం రేపుతోంది. 
 
నిజానికి గడిచిన రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో మురళీమోహన్ కీలక భూమిక పోషించారు. గత రెండు ఎన్నికల్లోనూ రాజమండ్రి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తొలిసారి 2009లో ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ రెండోసారి 2014లో మాత్రం ఘన విజయం సాధించారు. దాంతో వచ్చే ఎన్నికల్లో బలమైన నేతగా మురళీమోహన్ బరిలో ఉంటారని అంతా భావించారు. అయితే, ఆయన అనూహ్యంగా తాను పోటీ చేయలేనంటూ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
 
మురళీమోహన్ ఎన్నికలకు దూరంగా ఉండడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలోని మూడు పార్లమెంట్ స్థానాలకు గానూ కాకినాడ ఎంపీ తోట నరసింహం అనారోగ్యంతో పోటీ చేయలేనని ప్రకటించారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు పార్టీ మారిపోయారు. ఇప్పుడు రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహన్ సైతం తనకు ఆసక్తి లేదని చెప్పడంతో టీడీపీ కొత్త నేతల కోసం వెదుకులాట సాగించాల్సి వస్తోంది. 
 
నటుడిగా మురళీ మోహన్ తెలుగు ప్రజలకు సుపరిచితుడు. ఇక ఆయన జయభేరి గ్రూప్ సంస్థల గురించి కూడా తెలియని వారుండరు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈయన సినీ పరిశ్రమలో రాణించి తర్వాత హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టారు. తర్వాత టీడీపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు. అయితే, ఇప్పుడు హఠాత్తుగా తన ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పడం సందేహాలకు తావిస్తోంది.