బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2016 (13:28 IST)

మగ్గుతున్న తిరుమల శ్రీవారి తలనీలాలు.. రూ.కోట్ల ఆదాయానికి గండి

తిరుమల శ్రీనివాసునికి భక్తులు హుండీలో వేసే కానుకలే కాదు... భక్తితో సమర్పిస్తున్న కురుల ద్వారానూ సిరులు కురుస్తున్నాయి. తలనీలాల విక్రయంతో శ్రీవారికి యేటా 150 కోట్ల రూపాయలకుపైగా ఆదాయం సమకూరుతోంది. మార్క

తిరుమల శ్రీనివాసునికి భక్తులు హుండీలో వేసే కానుకలే కాదు... భక్తితో సమర్పిస్తున్న కురుల ద్వారానూ సిరులు కురుస్తున్నాయి. తలనీలాల విక్రయంతో శ్రీవారికి యేటా 150 కోట్ల రూపాయలకుపైగా ఆదాయం సమకూరుతోంది. మార్కెట్‌తో కురుల ధరలు మెండుగా ఉన్నప్పుడు రూ.240 కోట్లు వచ్చిన సందర్భం కూడా ఉంది. అయితే అంతర్జాతీయంగా తలనీలాల మార్కెట్‌తో తలెత్తుతున్న ఒడుదుడుకులతో శ్రీవారి ఆదాయం రూ.కోట్లలో తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. టిటిడి వద్ద గుట్టలు గుట్టలుగా పోగవుతున్న తలనీలాలు ఆశించిన రీతిలో అమ్ముడుపోవడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌ చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా తలనీలాలను అమ్ముకోవడానికి ఏమి చేయాలనే అధ్యయనం టిటిడి అధికారుల్లో కొరవడింది. దీంతో కాసులు పండించే కేశాలు నెలల తరబడి గోదాముల్లో మగ్గిపోతున్నాయి.
 
తిరుమలలో రోజుకు సగటున 20 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తుంటారు. ఇక్కడ పోగయ్యే వెంట్రుకలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన మెటీరియల్‌ అండ్‌ స్క్రాప్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఈ-వేలం నిర్వహించిన ఎప్పటికప్పుడు విక్రయిస్తుంటారు. 2001 సంవత్సరంలో ముందు సంప్రదాయ పద్ధతిలో వేలం నిర్వహించేవారు. ఆ తర్వాత దీన్ని ఆన్‌లైన్‌ పద్ధతిలోకి మార్చారు. అప్పటి నుంచి తలనీలాల ద్వారా టిటిడికి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. టిటిడి కళ్యాణకట్టలో సమీకరించే కురులను ఐదు రకాలుగా విభజిస్తారు.
 
31 అంగుళాలు, అంతకన్నా ఎక్కువ పొడవులు ఉన్న జుత్తును మొదటి రకంగా 16-30 అంగుళాల జుత్తును రెండో రకం. 10-15 అంగుళాల జుత్తు మూడోరకం, 5-9 అంగుళాలు నాలుగోరకం, ఐదు అంగుళాల రకం కన్నా తక్కువ పొడవున్న జుత్తును ఐదోరకంగా విభజిస్తారు. అలాగే తెల్లజుత్తును ఆరోరకంగా వర్గీకరించి విక్రయిస్తున్నారు. గతంలో మూడు నెలలకు ఒకసారి వేలం నిర్వహించేవారు. సాంబశివరావు ఈఓగా వచ్చాక ప్రతినెలా మొదటి గురువారం తలనీలాల వేలం జరుగుతోంది.
 
ఆన్‌లైన్‌ వేలం నిర్వహించడానికి ముందుదాకా తలనీలాల ద్వారా టిటిడి వచ్చే ఆదాయం రూ.100 కోట్లకు దాటలేదు. కొత్త పద్దతిలో 2011-12లో రూ.160 కోట్లు ఆదాయం సమకూరింది. 2013-14లో ఏకంగా రూ.240 కోట్ల రూపాయలు వచ్చింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. 2014-15లో రూ.169 కోట్ల రూపాయలు పరిమితమైంది. 2015-16లో రూ.150 కోట్లు మాత్రమే సమకూరింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలోనూ రూ.150 కోట్లు రావచ్చని అంచనా వేశారు. అయితే తలనీలాల మార్కెట్‌లో వస్తున్న ఒడుదుడుకులు చూస్తుంటే ఆ మేరకైనా ఆదాయం లభిస్తుందా అనేది అనుమానంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కురుల ధరలు తగ్గిపోవడం, టిటిడి నిర్ణయించిన ధరలు గిట్టుబాటు కాకపోవడంతో కంపెనీలు తలనీలాలకు, కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో కురులు టిటిడి గోదామల్లోనే నెలల తరబడి మగ్గిపోతున్నాయి.
 
ఈ యేడాది జూన్‌లో మొదటి రకం తలనీలాలు 3,100 కిలోలు వేలానికి ఉంచగా 3,700 కిలోలు మాత్రమే అమ్ముడయ్యాయి. మూడో రకం 72,000 గాను 400 కిలోలు మాత్రమే విక్రయమయ్యాయి. నాలుగో రకం 13,700 కిలోలు వేలంలో పెట్టగా ఒక్క కిలో కూడా అమ్ముడుకాలేదు. ఆ నెలలో మొత్తం 1.36 లక్షల కిలోలు వేలం వేయగా 5,300 కిలోలు మాత్రమే అమ్ముడయ్యాయి. సెప్టెంబర్‌ 2016లో మొదటి రకం కురులు 4,400 కిలోలు వేలానికి సిద్ధం చేసినా 300కిలోలు మాత్రమే బిడ్డర్లు కొనుగోలు చేశారు. రెండోరకం 32,900 కిలోలకుగాను ఆరువేల కిలోలు అమ్ముడయ్యాయి. మూడోరకం 86,100 కిలోలుండగా ఒక్క కిలో కూడా సేల్‌ కాలేదు. ఈ నెలలో అన్ని రకాలూ కలిపి మొత్తం 2.06 లక్షల కిలోలు వేలం వేయగా 11,000 కిలోలు మాత్రమే అమ్ముడయ్యాయి. మధ్యలో జూలై, ఆగస్టు నెలల్లోనూ ఇదే పరిస్థితి. 
 
గత కొన్ని నెలలుగా సరిగా అమ్ముడుపోని కారణంగా జుత్తు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈనెల వేలం తర్వాత మొదటి రకం 4,100కిలోలు, రెండో రకం 26,000కిలోలు, మూడో రకం 86,000 కిలోలు, నాలుగోరకం 15,100 కిలోలు, ఐదోరకం 62,000కిలోలు, ఆరోరకం 2,300కిలోలు, నిల్వ ఉన్నాయి. అంటే దాదాపు 2 లక్షల కిలోలు నిల్వున్నాయి. జూన్‌ నెలలో 1.36లక్షల కిలోలు నిల్వుండగా మూడు నెలల్లో 2లక్షల కిలోలకు పెరిగింది. గతంలో వేలంలో ఉంచిన మొత్తం తలనీలాలు అమ్ముడయ్యేవి. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది.
 
అంతర్జాతీయ కురులకు ధర తగ్గడమే కారణమని మానవ కేశాలకు ఎగుమతి చేసే కంపెనీలు చెబుతున్నాయి. టిటిడి నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేస్తే గిట్టుబాటుకావడం లేదని అంటున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్‌ ధర మరింత తగ్గితే కురులు పూర్తిగా అమ్ముడుపోకుండా పోయే ప్రమాదం ఏర్పడి. టిటిడి భారీగా నష్టపోయే పరిస్థితి తలెత్తవచ్చు. కురులు ఎక్కువ వాలం నిల్వ ఉండటం వల్ల నాణ్యత తగ్గిపోయి ఆ మేరకు ధర తగ్గే ప్రమాదమూ ఉంది. అయితే ధర ఎందుకు తగ్గించాలి. మాకు వచ్చే నష్టమేముంది. స్టాకు నిల్వ చేసుకుంటాం అనే రీతిలో ఆలోచిస్తున్నారు. ధర పెరుగుతుందన్న నమ్మకం ఉన్నప్పుడు అలా నిల్వ ఉంచుకోవడంతో తప్పు లేదు గానీ ధర పెరిగే అవకాశం లేదని తెలిసినప్పుడూ నిల్వ ఉంచుకోవడం మంచి వ్యాపారవేత్త లక్షణం కాదు. టిటిడి ధార్మిక సంస్థే అయినా మార్కెటింగ్‌ విభాగంలో పనిచేస్తున్న అధికారులు ఇలాంటి వ్యాపార సూత్రాలనూ ఎంతో కొంత ఒంటపట్టించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.