సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జెఎస్కె
Last Updated : బుధవారం, 14 జులై 2021 (10:20 IST)

విజ‌య‌వాడ‌కు మేయ‌ర్ అయితే ఇక అంతే, వారికి అది అందని ద్రాక్ష, ఏంటది?

రాజ‌కీయాల్లో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వాటిని మూఢ న‌మ్మ‌కాలు అని అన‌లేం గాని, అలా జ‌రిగిపోతుంది అంతే. ఇపుడు కొత్త‌గా మ‌రో సెంటిమెంటు మొద‌లైంది. విజ‌య‌వాడ న‌గ‌రానికి మేయ‌ర్ అయ్యారంటే...ఇక అంతే... అక్క‌డి నుంచి ఎలాంటి ఎదుగుద‌ల ఉండ‌దు. ఇది మేం అంటున్న మాట కాదు... రాజ‌కీయంగా ద‌శాబ్దాలుగా జ‌రుగుతున్న విష‌య‌మే. ఇప్ప‌టి వ‌ర‌కు బెజ‌వాడ‌కు మేయ‌ర్ అయిన వారు ఆ ప‌ద‌వి మెట్టు దిగ‌గానే క‌నుమ‌రుగ‌యిపోయారు. అందుకే ఆ సెంటిమెంటు ఇపుడు బ‌ల‌ప‌డింది.
 
బెజ‌వాడ మేయ‌ర్ పీఠం అంటే ఆషామాషీ కాదు. ఇంత‌టి మ‌హా న‌గ‌రానికి మేయ‌ర్ కావ‌డం అంటే, దాదాపు మంత్రి అయిన‌ట్లే. కానీ, ఆ మెట్టు దిగితే చాలు ఇక ప్ర‌జా ప్ర‌తినిధి పీఠం ఎవ‌రికీ ద‌క్క‌డం లేదు. ఇది చ‌రిత్ర చెప్పిన స‌త్యం. మామూలు కార్పొరేట‌ర్ అయిన వారు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన వారున్నారు. కానీ, మేయ‌ర్ అయిన వారు మ‌ళ్ళీ సోదిలో లేకుండా పోతున్నారు. 
 
బెజ‌వాడ మేయ‌ర్లుగా తేత‌లి వెంక‌టేశ్వ‌ర‌రావు, జంధ్యాల శంక‌ర్ వంటి మ‌హామ‌హులు ప‌నిచేశారు. ఆ త‌ర్వాత వారిద్ద‌రూ ఎమ్మెల్యే కూడా కాలేక‌పోయారు. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన జంధ్యాల శంక‌ర్, త‌మ వారి ఓట్లు అధికంగా ఉన్నాయ‌ని ఒక‌సారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ, విజ‌యం సాధించ లేక‌పోయారు. అప్ప‌టి నుంచి తెర‌వెనుకే ఉండిపోయారు. మ‌రో ప‌క్క చిన్న వ‌య‌సులోనే పంచుమ‌ర్తి అనూరాధ విజ‌య‌వాడ మేయ‌ర్ ప‌దవిని అలంక‌రించారు.

కానీ, ఆమె కూడా త‌ర్వాత‌, టీడీపీలో త‌న రాజ‌కీయ పోరాటాన్ని కొన‌సాగిస్తున్నారు. ఎన్నో సార్లు ఆమె ఎమ్మెల్యే కావాల‌ని, ఎమ్మెల్సీ రావాల‌ని కోరుకున్నా... సాధ్య‌ప‌డ‌లేదు. గ‌త అయిదేళ్ళుగా టీడీపీకి చెందిన కోనేరు శ్రీధ‌ర్ మేయ‌ర్‌గా ప‌నిచేశారు. ఆయ‌న త‌న‌కు ఎమ్మెల్యే టిక్కెట్ వ‌స్తుంద‌ని ఘంటాప‌ధంగా చెప్పుకొచ్చినా, సీటు రాలేదు...ఎమ్మెల్యే కాలేదు.

ఇపుడు తాజాగా వైసీపీ విజ‌య‌వాడ కార్పొరేష‌న్లో ఆధిక్యాన్ని సాధించింది. రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి కొత్తగా మేయ‌ర్ అయ్యారు. ఆమెను మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్ స‌పోర్ట్ చేసి, మేయ‌ర్ పీఠాన్ని ఎక్కించారు. అయితే, ఎవ‌రు మేయ‌ర్ అయినా, విజ‌య‌వాడ‌లో వెనుక నుంచి మ‌రో ఫామ్‌లో ఉన్న నేత నీలి నీడ‌లు వారిపై ప‌డుతుండ‌టంతో... ఎదుగుద‌ల లేకుండా పోతోంది.