శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ఫెంగ్ షుయ్
Written By
Last Updated : శనివారం, 20 అక్టోబరు 2018 (15:01 IST)

ప్రేమికులు లాఫింగ్ బుద్ధను కానుకగా ఇస్తే.. వారి ప్రేమ..?

ప్రేమికులు లాఫింగ్ బుద్ధను కానుకగా ఇస్తే.. వారి ప్రేమ.. వివాహబంధంగా మారి కలకాలం బాగుంటుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రేమికుల రోజు, పుట్టిన రోజు సందర్భంగా లాఫింగ్ బుద్ధను కానుకగా ఇస్తే ప్రేమ జంటల మధ్య అనుబంధం బలపడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగులు నిలబడి నవ్వుతూ ఉన్న విగ్రహాన్ని ఆఫీసు డెస్క్ మీద పెట్టుకుంటే మానసిక ఒత్తిడి తొలగటంతో పాటు సహోద్యోగుల సహకారం లభిస్తుంది. 
 
అలాగే సింహద్వారానికి ఎదురుగా సూర్యకిరణాలు పడే చోట లాఫింగ్ బుద్ధను పెడితే అన్నివిధాలా మేలు జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు వుండవు. నిలబడి ఉన్న లాఫింగ్ బుద్ధ ప్రతిమను తూర్పుదిశకు అభిముఖంగా ఉంచాలి. కుటుంబ సమస్యలున్నవారు దీన్ని ఇంట్లో అందరికీ కనిపించేలా పెట్టాలి. లివింగ్‌ రూమ్‌ లేదా హాల్‌లో పశ్చిమాభిముఖంగా కూడా పెట్టుకోవచ్చు. 
 
ముత్యాలు, రత్నాలతో కూడిన విగ్రహాన్ని స్టడీ రూమ్‌లో పెడితే దాని నుంచి వచ్చే సానుకూల తరంగాల వల్ల పిల్లలు చదువులో రాణిస్తారు. అదే.. హాల్ ఈశాన్య మూలన పెడితే యజమాని ఆదాయం పెరుగుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. 
 
ఇకపోతే.. కూర్చొని చేతులు పైకెత్తి బంగారు బంతులు మోస్తూ కనిపించే లాఫింగ్ బుద్ధ ప్రతిమ ఆయురారోగ్యాలు ఇస్తుందనీ, నిలబడి నవ్వుతూ ఉండే రూపు సుఖసంపదలను అందిస్తుందని చెప్తారు. చేతిలో విసనకర్ర లేదా కర్రతో ఉన్న ప్రతిమ ప్రయాణ సమయంలో వచ్చే ఆపదల నుంచి కాపాడుతుందనీ, బంగారు నాణాల రాశి మీద కూర్చుని ఉన్న విగ్రహం ఇంట్లో ఉంటే ఆ ఇంట సిరిసంపదలు వర్షిస్తాయని అర్థం.
 
బంగారు రంగు ప్రతిమ ప్రతికూల శక్తులను హరిస్తుందనీ, మెడలో ముత్యాల మాల, చేతిలో బంతిని కలిగి ఉన్న విగ్రహం ధ్యానం, సంపద, ఆరోగ్యానికి ప్రతీకనీ, స్పటిక విగ్రహం జ్ఞానదాయకమని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.