శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2017 (12:22 IST)

ఉగాది తేదీపై లొల్లి : మార్చి 28నే.. కాదు కాదు.. 29.. పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు

తెలుగు సంవత్సరాది ఉగాదిని ఎపుడు జరుపుకోవాలన్న అంశంపై పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ యేడాది ఉగాదిని మార్చి 28న జరుపుకోవాలా? లేక మార్చి 29వ తేదీన జరుపుకోవాలా అనే అంశంపై పండితులు తమకుతోచిన

తెలుగు సంవత్సరాది ఉగాదిని ఎపుడు జరుపుకోవాలన్న అంశంపై పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ యేడాది ఉగాదిని మార్చి 28న జరుపుకోవాలా? లేక మార్చి 29వ తేదీన జరుపుకోవాలా అనే అంశంపై పండితులు తమకుతోచిన తేదీని చెపుతున్నారు. 

నిజానికి ఈ యేడాది కొన్ని పంచాంగాలు, క్యాలెండర్లు మార్చి 28న శ్రీహేవళంబి నామ సంవత్సర ఉగాది అని, మరికొన్ని మార్చి 29 ఉగాది అని పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు మార్చి 29న ఉగాది సెలవు ప్రకటించాయి.

అయితే పలు పంచాంగాలు, క్యాలెండర్లలో మార్చి 28న ఉగాది అని పేర్కొన్నాయి. తాజాగా శ్రీనివాస గార్గేయ కూడా 28వ తేదీనే ఉగాది అని ప్రకటించారు. దీంతో ఏ తేదీన ఉగాది జరుపుకోవాలనే అంశంపై ప్రజల్లో అయోమయం నెలకొంది. 
 
మార్చి 28న ఉదయం 8.27 గంటలకు అమావాస్య తిథి అంతమై హేవళంబి నామ సంవత్సర పాఢ్యమి ప్రారంభం అవుతున్నది. అదే రోజు తెల్లవారుజామున 5.45 గంటలకు పాఢ్యమి కూడా ముగిసిపోతున్నది. రెండు సూర్యోదయాల సమయంలో పాడ్యమి తిథి లేనప్పుడు ముందు రోజునే పాఢ్యమిగా భావించాలని ప్రామాణిక గ్రంథం ధర్మసింధులో స్పష్టంగా ఉన్నదని, అందుకే మార్చి 28ని ఉగాదిగా నిర్ణయించినట్లు భారత ప్రభుత్వ పంచాంగ గణన పద్ధతిని అనుసరించే దృక్‌ సిద్ధాంతులు చెబుతున్నారు. 
 
మార్చి 29 ఉదయం 8 గంటల వరకు పాఢ్యమి తిథి మిగులు ఉన్నందున ఆ రోజునే ఉగాది జరుపుకోవాలని పూర్వ సిద్ధాంతాన్ని అనుసరించి పంచాంగాన్ని రూపొందించే సిద్ధాంతులు, ఛాయార్క, కరణార్క దృక్‌ సిద్ధాంత పద్ధతిని అనుసరించే పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ రెండు సిద్ధాంతాలు అనుసరించే పండితుల ఆధ్వర్యంలో ఈ నెల 22న రాజమండ్రిలో నిర్వహించిన పంచాంగకర్తల సమావేశంలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. 
 
అయితే, తెలుగు రాష్ట్రాల్లో సుమారు 120 మంది పంచాగకర్తలు ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో రచించిన పంచాంగాలు, క్యాలెండర్లు కోట్లాది మంది తెలుగు వారికి నిత్యం మార్గదర్శనం చేస్తున్నాయి. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణాలనే ఐదు అంశాలతో కూడిన పంచాంగ సమయాల్లో ఎంతో వ్యత్యాసం ఉంటున్నది. ఫలితంగా ఏ సమయం సరైనదో అర్థం కాక ప్రజలు తికమకపడుతున్నారు. పంచాంగ రచనకు ఒకొక్కరు ఒక్కో పద్ధతిని అనుసరించడం ఈ సమస్యకు ప్రధాన కారణం.