శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఆర్. సందీప్
Last Modified: శుక్రవారం, 22 మే 2020 (13:55 IST)

కాకర కాయ రసంతో ఇవి తగ్గించుకోవచ్చు

జీవన విధానం మారడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు శరీరంలో చొరబడుతున్నాయి. చిన్న వయస్సులోనే బీపీ, షుగర్ లాంటి వ్యాధులు కబళిస్తున్నాయి. పని ఒత్తిడి, పౌష్టికాహార లోపం కొన్ని వ్యాధులకు కారణమైతే, మరికొన్ని వంశపారంపర్యంగా వచ్చేవి. వీటిని నివారించడానికి డాక్టర్ల చుట్టూ తిరిగి డబ్బు నష్టపోవడమే కాక, దుష్ఫలితాలతో సతమతమయ్యే పరిస్థితి వస్తోంది. 
 
డయాబెటిస్‌ని సరైన సమయంలో గుర్తించినట్లయితే దానిని నివారించడం లేదా అదుపు చేయడం సులభం అవుతుంది. ఎన్ని మందులు వాడినా ఇంట్లో లభించే కొన్ని సాధారణ వస్తువులతో దానిని అడ్డుకోవడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే కాకరకాయ మధుమేహానికి మంచి మందు. కాకరకాయలో విటమిన్లు, ఖనిజలవణాలు, ఫైబర్ ఉండటం మూలాన బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది. 
 
కాకరకాయను అలాగే తనలేం కనుక జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వయస్సు మీదపడటం వల్ల చర్మంలో వచ్చే మార్పులను తగ్గిస్తుంది. అలాగే వాపులు గడ్డలు రాకుండా నివారిస్తుంది. కాకరకాయను ముక్కలుగా చేసి కొంచెం ఉప్పువేసి మిక్సీ పట్టాలి. అందులో నుండి జ్యూస్‌ని వడకట్టి నిమ్మరసం, పసుపు వేసుకుని త్రాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. దీన్ని సాధారణంగా ఉదయం పరగడుపున త్రాగాలి. గ్యాస్, అసిడిటీ సమస్యతో బాధపడే వారు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత త్రాగాలి.