సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 30 అక్టోబరు 2021 (22:16 IST)

కొలెసైస్టిటిస్: మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశం

ఇటీవలి కాలంలో క్రమ రహిత షెడ్యూల్‌, నియంత్రణ లేని జీవనశైలి అవసరాల కారణంగా, ప్రజలు తరచుగా తమ జీర్ణ ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపడం లేదు. జీర్ణ వ్యవస్ధపై తగిన శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకత ఉంది. తగినంతగా నీరు తాగడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అనేవి జీర్ణ వ్యవస్ధ సరిగా పనిచేసేందుకు తోడ్పడతాయి.

 
కొలెసైస్టిటిస్‌ను పిత్తాశయ వాపుగా చెబుతుంటారు. ఇది అతి సహజంగా కనిపించే గాల్‌బ్లాడర్‌ (పిత్తాశయం) సమస్య. సాధారణంగా పిత్తాశయంలో రాళ్లు, పిత్తాశయ ద్వారానికి అడ్డుతగిలితే ఇది సంభవిస్తుంది. కొలెసైస్టిటిస్‌ కారణంగా తీవ్రమైన నొప్పి వస్తుంది. దీని కారణంగా తీవ్రమైన సమస్యలు కూడా రావొచ్చు.

 
కొలెసైస్టిటిస్‌ అంటే ఏమిటి?
బేరిపండు ఆకారంలోని అవయవం, పిత్తాశయం. జీర్ణవ్యవస్థలో భాగంగా ఇది ఉంటుంది. ఈ పిత్తాశయంలో బైల్‌ నిల్వ ఉంటుంది. జీర్ణవ్యవస్థలో దీని అవసరం వచ్చినప్పుడు ఇది బైల్‌ (పిత్తము) విడుదల చేస్తుంది. ఈ పిత్తము విడుదల కాకుండా, బ్యాక్టీరియా చేత ఇన్‌ఫెక్ట్‌ అయినప్పుడు కొలెసైస్టిటిస్‌ ఏర్పడుతుంది. సాధారణంగా పిత్తాశయం నుంచి పిత్తము బయటకు రాకుండా పిత్తాశయ రాళ్లు అడ్డుపడుతుంటాయి.

 
పిత్తాశయంలో ఈ పిత్తము పేరుకుపోవడం కారణంగా పిత్తాశయ రాళ్లు ఏర్పడుతుంటాయి. ఇవి విభిన్న పరిమాణాలలో ఉంటాయి. తమంతట తాము ఇవి ఎలాంటి హానీ తలపెట్టలేవు. అయితే, ఈ పిత్తాశయ రాళ్లు ఒకసారి పిత్తాశయం వదిలితే అవి పిత్తాశయ నాళంలో అడ్డుపడి, పిత్తము బయటకు రాకుండా అడ్డుకుంటాయి. ఈ ఫలితంగా పిత్తాశయ గోడలు వాయడం సంభవించవచ్చు.

 
కొలెసైస్టిటిస్‌ వల్ల ప్రమాదం బారినపడేది ఎవరు?
భారతదేశంలో పిత్తాశయ సమస్యలు అతి సహజంగా కనిపిస్తుంటాయి. కొలెసైస్టిటిస్‌ దగ్గరకు వచ్చేసరికి కొన్ని కారణాల కారణంగా కొంతమంది వ్యక్తులలో తీవ్ర ప్రభావం కలుగవచ్చు.

 
కుటుంబ చరిత్ర: ఓ వ్యక్తి కుటుంబంలో పిత్తాశయ రాళ్లు ఏర్పడిన చరిత్ర ఉంటే వారు జాగ్రత్తగా ఉండాలి.  మగవారితో పోలిస్తే స్త్రీలలో కొలెసైస్టిటిస్‌ అధికంగా ఏర్పడే అవకాశాలున్నాయి. మరీ ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన మహిళలు ఈ స్థితితో బాధపడవచ్చు.

 
ఆహారపు అలవాట్లు: జీర్ణసంబంధిత సమస్యలకు ఆహారపు అలవాట్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. అధికంగా కొవ్వు ఉన్న పదార్ధాలు కొలెసైస్టిటిస్‌పై ప్రభావం చూపుతాయి. ఈ కారణం చేతనే ఉబకాయులు ఎక్కువగా ఈ సమస్యకు గురవుతుంటారు.

 
వైద్యస్థితి: మధుమేహులు, అలాగే స్వల్పకాలంలో ఎక్కువ బరువు కోల్పోయిన వారు తమ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే గర్భిణిలు, ఈస్ట్రోజన్‌ మార్పిడి లేదా గర్భనియంత్రణ మాత్రలు వాడుతున్న వారు కూడా అప్రమప్తంగా ఉండాలి.

కొలెసైస్టిటిస్‌ లక్షణాలు:
కడుపు పైభాగంలో లేదా మధ్యభాగంలో తీవ్రమైన నొప్పి వచ్చి అది నెమ్మదిగా వీపు భాగానికి విస్తరించిన ఎడల అనుమానించాలి. ఈ నొప్పి కారణంగా జ్వరం, వికారం, వాంతులు కూడా రావొచ్చు. సమయానికి తగిన చికిత్స అందించకపోతే పిత్తాశయానికి చిల్లులు పడి, శస్త్రచికిత్స కష్టమయ్యే పరిస్థితులూ తలెత్తవచ్చు.

 
నిర్థారణ, చికిత్స
రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్‌, అబ్డోనమల్‌ సీటీ స్కాన్‌ వంటి వాటి ద్వారా కొలెసైస్టిటిస్‌ గుర్తిస్తారు. పిత్తాశయ సమస్య, దాని తీవ్రత, ఇన్‌ఫెక్షన్‌ తీరు వంటి వాటిని గుర్తించేందుకు ఇవి సహాయపడతాయి.

 
సాధారణంగా చికిత్సను డాక్టర్‌ పర్యవేక్షణలో చేస్తారు. రోగులను ఉపవాసం ఉండమని సూచించవచ్చు. తద్వారా పిత్తాశయానికి తగిన విశ్రాంతినందిచడం చేస్తారు. అదే సమయంలో డీహైడ్రేషన్‌ కాకుండా ఐవీ ఫ్లూయిడ్స్‌ అందిస్తారు. ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణకు యాంటీబయాటిక్స్‌, ఇతర ఔషదాలు అందజేస్తారు. శస్త్రచికిత్సతో పిత్తాశయంలో రాళ్లు తొలగిస్తారు.

 
నివారణ
కొలెసైస్టిటిస్‌ సమస్య రాకుండా ఉండాలంటే..
ఆరోగ్యవంతమైనది తినాలి: అధికంగా పండ్లు, కూరగాయలు, గింజధాన్యాలు తినడంతో పాటుగా ఆరోగ్యవంతమైన కొవ్వు జోడించాలి.
 
జీవనశైలి ప్రక్రియలు: క్రమం తప్పకుండా వ్యాయామాలు, యోగా లాంటివి చేయాలి. శరీరంలో కొవ్వు నియంత్రణలో ఉంచుకోవాలి.
 
తగినంత నీరు తీసుకోవాలి: డీహైడ్రేషన్‌ కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు తీవ్రంగా ఉంటాయి. కనుక తగినంతగా నీరు తాగాలి.
 
కొలెసైస్టిటిస్‌ అనేది అతి తీవ్రమైన సమస్య. ముందుగానే సమస్యను గుర్తించి, తగిన చికిత్సనందించడం ద్వారా సమస్యలను నివారించవచ్చు. దీర్ఘకాలిక సమస్యలు రాకుండా ఉండాలంటే శస్త్రచికిత్స ఒక్కటే మార్గం.
 
-డాక్టర్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌, కొండాపూర్‌, హైదరాబాద్‌