1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By PNR
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2015 (13:38 IST)

"సర్వేంద్రియాణాం నయనం ప్రధానం".... నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు ప్రారంభం

"సర్వేంద్రియాణాం నయనం ప్రధానం". అందమైన ప్రపంచాన్ని మనకు పరిచయం చేసే అవయవం... దేహంలోని ముఖ్యమైన భాగం నేత్రం. కొందరు పుట్టుకతోనే అంధత్వం బారినపడుతుంటే.. మరికొందరు ప్రమాదాల కారణంగా కంటిచూపును కోల్పోతున్నారు. ఇలాంటి వారికి అంధకారంలో ఓ చిన్న వెలుగు నేత్రదానం. ఇలాంటి నేత్రదానంపై అవగాహన కల్పించి తగిన ప్రచారం చేస్తే అనేకమంది ఆనందకర ప్రపంచాన్ని నేత్రదాతల నయనాలతో ఆస్వాదిస్తారు. ఇందులో భాగంగా ప్రతియేటా ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జాతీయ నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 
 
నిజానికి నేతదానం గత 1950 నుంచి ప్రచారంలోకి వచ్చింది. అయితే, 1990 నుంచి మాత్రమే ప్రాధాన్యత పెరిగింది. గత 20 యేళ్ళ నుంచి నేత్రదానంపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా అవగాహన పెరిగింది. ఫలితంగా అనేక నగరాల్లో నేత్రదానం చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే, నేత్రదానం చేసిన వారికి ప్రభుత్వాల నుంచి మరింత ప్రోత్సహం ఉంటే.. మరింతమంది దాతలు ముందుకు వచ్చి నేత్రదానం చేస్తారని అనేక మంది వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
అయితే, నేత్రదానం చేసేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి మరణించిన ఆరు గంటల లోపు వ్యక్తి నుంచి కార్నియా సేకరించాల్సి ఉంటుంది. వీటిని ఐస్ బాక్సులో పెట్టిన మృతదేహం నుంచి అయితే ఎనిమిది గంటల్లోపు కళ్లను సేకరించవచ్చు. చనిపోయిన వెంటనే కళ్లు వూసివేయాలి. అలాగే, నేత్రాలపై తడిపిన దూది లేదా కాటన్ వస్త్రాన్ని పెట్టాలి. ఐస్ బాక్స్‌లో ఉంచినా ఇలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. ముఖ్యంగా.. చనిపోయిన తర్వాత కళ్ళపై ఈగలు, దోమలు వాలకుండా, భౌతికకాయంపై ఎక్కువ నీళ్లు పడకుండా చూసుకోవాలి.