శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 జులై 2019 (08:22 IST)

నెల‌స‌రి స‌మ‌స్య‌లతో సతమతమవుతున్నారా?

మహిళల శారీరక ఆరోగ్యంలో కీలకపాత్ర పోషించే పునరుత్పత్తి వ్యవస్థ. ఈ పునరుత్పత్తి ప్రక్రియకు సిద్ధం చేయడంలో ముఖ్యమైనది రుతుచక్రం. దీనినే నెలసరి అని వ్యవహరిస్తుంటారు. యుక్త వయస్కురాలైనప్పటి నుంచీ నడిమి వయస్సు వరకూ నెలనెలా మహిళల జీవితంలో అతి సాధారణంగా జరిగిపోయే ఒక అతి సంక్లిష్టమైన జీవ ప్రక్రియ ఇది. 
 
మహిళల శారీరక మార్పులు, ఆరోగ్యంతో ఇది ముడిపడి ఉంటుంది. అయితే కొందరిలో నెలసరి సక్రమంగా లేకపోవడం, కొన్నిసార్లు తక్కువగా, మరి కొన్నిసార్లు ఎక్కువగా రుతుస్రావం కావడం, ఆ సమయానికి ముందే వచ్చే తీవ్రమైన కడుపునొప్పి, నడుము నొప్పి, ఎన్నో రకాల సందేహాలు, ఉద్వేగాలు తదితర అంశాలన్నీ మహిళలకు ఎన్నో ఆరోగ్య సమస్యల బరిలో ఉన్నామనే ఆందోళన కలిగిస్తుంటాయి. 
 
మహిళలు ఎక్కువ మంది సతమతమయ్యే ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైనది నెలసరి. సక్రమంగా రుతుస్రావం కాకపోవడం, దానికి సంబంధించిన అంశాలతో ముడిపడి ఉన్న ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడనివారు దాదాపు లేరనే స్పష్టమవుతోంది. దీనికి కారణాలెన్నో. మహిళలపై కుటుంబపరమైన, వృత్తిపరమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే దీని ప్రభావం వారి శరీరంలో కీలకపాత్ర వహించే హార్మోన్లపై పడుతోంది. 
 
దీని ఫలితంగా రుతుక్రమంలో రకరకాల వ్యత్యాసాలు చోటుచేసుకుంటుంటాయి. అందువల్ల రుతు సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. వీరికి అమినోరియా, గర్భధారణ జరగకపోవడం, ఎర్లీ మెనోపాజ్‌, పీసీఓడీ, ఫైబ్రాయిడ్స్‌, మెనుస్ట్రువల్‌ డిజార్డర్స్‌ వంటి రకరకాల సమస్యలు శారీరక, మానసిక అనారోగ్యాలకు గురిచేస్తున్నాయి.
 
అమినోరియా
శారీరక ఎదుగుదల సక్రమంగా ఉన్నా నిర్ణీత సమయానికి రుతుక్రమం రాకపోవడాన్ని అమినోరియా అంటారు. ఇది ప్రైమరీ అమినోరియా, సెకండరీ అమినోరియా అని రెండు రకాలు.
 
ప్రైమరీ అమినోరియా
స్త్రీలు యుక్త వయస్సుకు వచ్చినప్పటికీ అంటే 16 సంవత్సరాల తర్వాత కూడా రుతుచక్రం ప్రారంభం కాకపోవడాన్ని ప్రైమరీ అమినోరియా అంటారు. క్రోమోజోములకు సంబంధించిన లేదా జన్యుపరమైన సమస్యలు దీనికి కారణం. ముఖ్యంగా టర్నర్స్‌ సిండ్రోమ్‌, గర్భాశయ నిర్మాణ లోపాలు, గరాశయ ఇన్ఫెక్షన్లు, సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌, కుషింగ్స్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలు, హార్మోన్‌ అసమతుల్యతలు ముఖ్యంగా ఎడ్రినల్‌ గ్రంథి సమస్యలు, క్యాన్సర్‌ నివారణ మాత్రలు, యాంటీ డిప్రెసివ్‌ మాత్రలు వాడడం దీనికి కారణాలౌతాయి.
 
సెకండరీ అమినోరియా
బహిష్టు ప్రక్రియ సక్రమంగా ఉంటూ, ప్రసవానంతరం మూడు నెలల వరకు బహిష్టు కాకపోవడాన్ని సెకండరీ అమినోరియా అంటారు. పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో తల్లికి నెలసరి రాకపోవచ్చు. దీనికోసం ఎటువంటి చికిత్సా అవసరం లేదు. పిట్యూటరీ గ్రంథిó, థైరాయిడ్‌ సమస్యలు ఉన్నవారికి, గర్భనిరోధక మాత్రలు, కొన్నిరకాల యాంటీ డిప్రెషన్‌ మందులు వాడేవారికి, పీసీఓడీ (పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌) ఉన్నవారికి ఈ సమస్య ఎదురౌతుంది, శక్తికి మించి వ్యాయామం చేయడం, ఎక్కువసార్లు డి అండ్‌ సి చేయడం, గర్భ సంబంధిత ఆపరేషన్లు చేయించుకోవడం కూడా దీనికి కొంతవరకు కారణమౌతాయి.
 
డిస్మెనోరియా
ఈ సమస్య ఉన్నవారికి రుతుస్రావం సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. యుక్త వయసులో ఉన్న అమ్మాయిల్లో సాధారణంగా ఇది కనిపిస్తుంది. డిస్మెనోరియా మూడు రకాలుగా ఉంటుంది. అవి కంజెస్టివ్‌ డిస్మెనోరియా, స్పాస్మోడిక్‌ డిస్మెనోరియా, మెంబ్రేనస్‌ డిస్మెనోరియా.
 
కంజెస్టివ్‌ డిస్మెనోరియా
కొంతమందిలో బహిష్టుకు మూడు నుంచి ఐదు రోజుల ముందే పొత్తి కడుపులో, నడుము భాగంలో నొప్పితో ప్రారంభమవుతుంది. ఇది రుతుస్రావం మొదలైన తరువాత మందులు వాడకపోయినా దానికదే తగ్గిపోతుంది. దీనికి ఎండోమెట్రియాసిస్‌, మయోమస్‌, ఎడినోమోసిస్‌ వంటివి కారణం.
 
స్పాస్మోడిక్‌ డిస్మెనోరియా
బహిష్టు మొదలైన మొదటిరోజు మాత్రమే ఒకటి, రెండు గంటలు నొప్పి ఉండి, రుతుస్రావం సాఫీగా కావడంతో తగ్గిపోతుంది. ఈ సమయంలో వచ్చే నొప్పి ఎక్కువగా ఉండి, పొట్ట బిగదీసినట్లుగా ఉండడం, విరేచనాలు కావడం వంటి లక్షణాలు ఉంటాయి. నొప్పి మరీ అధికంగా ఉంటే వాంతులు అవుతాయి. దీనిని స్పాస్మోడిక్‌ డిస్మెనోరియా అంటారు. ఇంట్రా యుటెరైన్‌ కాంట్రాసెప్టిక్‌ డివైజెస్‌, సైకోజెనిక్‌ ఫ్యాక్టర్స్‌, ఒత్తిడి వంటివి కూడా ఈ సమస్యకు కారణం.
 
మెంబ్రేనస్‌ డిస్మెనోరియా
బహిష్టు సమయంలో నొప్పి భరించలేనంతగా ఉంటుంది. ఇది ఎక్కువ శాతం ఒత్తిడి వల్ల, హార్మోన్ల అసమతుల్యత వల్ల కలుగుతుంది.
 
అలిగోమెనోరియా
ప్రతి నెలా కాకుండా రెండు మూడు నెలలకోసారి నెలసరి రావడం అదీ చాలా తక్కువగా బ్లీడింగ్‌ కావటాన్ని ఆలిగోమెనోరియా అంటారు. దీనికి ప్రోలాక్టిన్‌ హార్మోన్‌ ఎక్కువ కావడం కారణం. వీరిలో రొమ్ము నుంచి పాలు వస్తుంటాయి. మానసిక వ్యాధులకు వాడే మందులు, అసిడిటీకి వాడే మందుల వల్ల ప్రోలాక్టిన్‌ అధికంగా విడుదలయ్యే అవకాశముంది. దీనివల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
 
పీసీఓడి
ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ (పీసీఓడి). ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న అమ్మాయిల్లో ఇది ఎక్కువగా ఉంది. 15 నుంచి 25 ఏళ్ల వయసున్న వారిలో కనిపిస్తోంది. దీనికి ప్రధానకారణం హార్మోన్ల అసమతుల్యత. స్త్రీలలో పురుష హార్మోన్లు (టెస్టోస్టెరాన్‌) పెరగడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. చాలా కాలంగా ఒత్తిడికి లోనవడం వలనా పీసీఓడి సమస్య వస్తుంది.
 
లక్షణాలు
ఈ సమస్య మొదలైన వెంటనే దాని ప్రభావం కనిపిస్తుంది. పీరియడ్స్‌ సరిగ్గా రాకపోవడం, వచ్చినా బ్లీడింగ్‌ ఎక్కువ కావడం, కడుపునొప్పి, అవాంఛిత రోమాలు, మెడ దగ్గర నల్లబడటం, జుట్టు రాలడం, ముఖంపై మొటిమలు రావడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. వీరిలో కనిపించే మరో ముఖ్యమైన లక్షణం అధికంగా బరువు పెరగడం. సంతానలేమి సమస్య కూడా వస్తుంది.
 
మెనోపాజ్‌
నడిమి వయసుకు చేరిన మహిళల్లో 45 నుంచి 55 ఏళ్ల మధ్య మెనోపాజ్‌ దశ కనిపిస్తుంది. దీనినే ముట్లుడగడం అంటారు. 50 ఏళ్ల వరకు పీరియడ్స్‌ కొనసాగడం వల్ల స్త్రీల ఆరోగ్యం బాగుంటుంది. 40 ఏళ్ల కన్నా ముందే మెనోపాజ్‌ వచ్చినట్లయితే ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌ లేదా ఎర్లీ మెనోపాజ్‌ అంటారు.
 
లక్షణాలు
మెనోపాజ్‌ దశలో మానసికంగా ఆందోళనకు గురవుతారు. నిద్రలేమి ఎక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ లోపం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. తలనొప్పి కనిపిస్తుంది. పీరియడ్స్‌ ఆగిపోతాయి. ఆస్టియో ఆర్థరైటిస్‌, నడుమునొప్పి వంటివి మొదలౌతాయి. మూత్రంలో మంట, చర్మం పొడిబారుతుంది. కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల స్థూలకాయం వస్తుంది.
 
ఫైబ్రాయిడ్స్‌ (కణుతులు)
మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య ఫైబ్రాయిడ్స్‌ లేదా గర్భాశయంలో కణుతులు ఏర్పడడం. గరాశయం లోపలి కండరం అధికంగా పెరిగి, గడ్డలుగా మారడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ కణుతులు క్యాన్సర్‌కు కారకాలు కావు. అయితే ఈ ఫైబ్రాయిడ్స్‌ ఏ వయసులోనైనా రావచ్చు. అంటే రుతుక్రమం మొదలైన దగ్గర నుంచి మెనోపాజ్‌ వరకు ఏ దశలోనైనా రావచ్చు. ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడటానికి ప్రత్యేక కారణమంటూ లేదు. చాలా మందిలో ఫైబ్రాయిడ్స్‌ ఉన్నా ఎలాంటి లక్షణాలూ బయటకు కనిపించవు. సాధారణంగా కణితి పరిమాణం, అది ఉన్న ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. ఇవి గర్భసంచి బయట ఉంటే వాటిని సబ్‌ సెరొసల్‌ ఫైబ్రాయిడ్స్‌ అంటారు. వీటివల్ల పెద్దగా సమస్య ఉండదు. గర్భసంచి లోపల ఏర్పడే సబ్‌మ్యూకోసల్‌, ఇంట్రా మ్యూరల్‌ ఫైబ్రాయిడ్స్‌ వల్ల అనేక సమస్యలు వస్తాయి
 
లక్షణాలు
ఫైబ్రాయిడ్‌ వలన గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. పీరియడ్స్‌ సరిగ్గా రావు. రక్తస్రావం, కడుపునొప్పి ఎక్కువగా ఉంటాయి. సంతానలేమి సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ఉంటే డాక్టర్‌ని తప్పనిసరిగా సంప్రదించాలి. 
 
నెలసరి సమస్యల్లో ఇవి కూడా...
- మెనోరేజియా సమస్యలో పీరియడ్స్‌ క్రమం తప్పకుండా వస్తాయి. కానీ రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. ఎండొక్రైన్‌ డిజార్డర్స్‌ వలన, కాంట్రాసెప్టివ్స్‌ ఎక్కువకాలం వాడటం, హైపోథైరాయిడిజమ్‌, ఫైబ్రాయిడ్స్‌, పీసీఓడి, ఎండోమెట్రియాసిస్‌ వంటి వాటివల్ల ఈ సమస్య వస్తుంది.
- పాలీమెనోరియా బాధితుల్లో రెండు, మూడు వారాలకొకసారి పీరియడ్స్‌ వస్తుంటాయి. అధిక రక్తస్రావం, ఎక్కువ రోజులు రక్తస్రావం జరుగుతుంది.
- మెట్రోరేజియా బాధితుల్లో క్రమం తప్పిన రుతుస్రావం జరుగుతుంది.
 
నిర్ధారణ, చికిత్స
అల్టాస్రౌండ్‌ స్కానింగ్‌, హార్మోన్‌ పరీక్షలతో నెలసరి సమస్యలను నిర్ధారించవచ్చు. రక్త పరీక్షలు - సీబీపీ, ఈఎస్‌ఆర్‌, హార్మోన్‌ పరీక్షలు - ఎఫ్‌ఎస్‌హెచ్‌, ఎల్‌హెచ్‌, ఎస్‌ ప్రోలాక్టిన్‌, థైరాయిడ్‌ ప్రోఫిక్‌, అల్టాస్రౌండ్‌, సిటిస్కాన్‌ అబ్డామిన్‌ ద్వారా రుతుచక్ర సమస్యలకు గల కారణాలను గుర్తించవచ్చు. ఆయా సమస్యలకు అనుగుణంగా గైనకాలజిస్ట్‌ పర్యవేక్షణలో మందులు వాడితే తక్కువ కాలంలోనే వీటి నుంచి బయటపడొచ్చు.
 
అవగాహనతోనే ఆందోళన దూరం
రుతుక్రమం లేదా నెలసరి అన్నది మెదడు నుంచి సంకేతాలతో మొదలై, పిట్యూటరీ గ్రంథి నుంచి హర్మోన్ల ప్రేరేపణతో, చివరికి అండాశయాల్లోని అండాలను ప్రేరేపించి, అవి విడుదలయ్యేలా చేస్తూ ఒక పరంపరగా జరిగిపోయే సంక్లిష్టమైన ప్రక్రియ. అందుకే దీనికి 'హైపోథలమిక్‌-పిట్యూటరీ-ఓవరీ యాక్సిస్‌' కీలకం. ఒకవైపు అండాశయాలను ప్రేరేపించి అండం విడుదలయ్యేలా చూసే ప్రక్రియ కొనసాగుతుంటే మరోవైపు ఆ అండం ఫలదీకరణం చెందితే, పిండంగా పెరిగేందుకు వీలుగా గర్భాశయంలో మందపాటి పొర ఏర్పడుతుంటుంది.

పిట్యూటరీ గ్రంథి నుంచి వచ్చే ఎఫ్‌ఎస్‌హెచ్‌, ఎల్‌హెచ్‌ హార్మోన్లు అండాశయం మీద పనిచేసినపుడు ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ విడుదలవుతాయి. దీనికి స్పందించి గర్భసంచిలోని ఎండోమెట్రియం పొర మందంగా మారుతుంటుంది. ఆ రుతుక్రమంలో గర్భధారణ జరగకపోతే.. ఆ పొర విడివడి రుతుస్రావం రూపంలో అండంతో సహా బయటకు వచ్చేస్తుంది. ఇదే నెలసరి, రుతుస్రావం. ఇది ముగిసిన తర్వాత, తిరిగి గర్భాశయంలో పొర ఏర్పడటం మొదలై, అది మళ్లీ సిద్ధమవుతుంటుంది. ఇది ప్రతి నెలసరిలోనూ సహజంగా జరిగే ప్రక్రియ అని అవగాహన చేసుకోవాలి.
 
నెలసరికి ముందు మనసులో చికాకు
35 ఏళ్లు దాటిన కొంతమంది మహిళలకు నెలసరికి ముందు చికాకుగా అనిపిస్తుంటుంది. దీన్నే 'ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌' అంటారు. ఇది ముఖ్యంగా అండం విడుదలయ్యాక పెరిగే ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ వలన వస్తుంది. వీరిలో చిరాకు, నడుంనొప్పి, కోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక రకంగా ఇది మానసిక చికాకు లాంటిదే.

దీనికి మనసును ఉల్లాసంగా ఉంచే మందులతో చికిత్స చేస్తారు. కొందరిలో దానంతట అదే పోవచ్చు కూడా. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో వివరిస్తే చాలామందిలో ఇది తగ్గిపోతుంది. ముఖ్యంగా భర్తలు, కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని మహిళలకు సహకరించాలి. అప్పుడే వారిలో ఆవగాహన పెరిగి ఆందోళనను దూరం చేసుకుంటారు.