1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: శనివారం, 16 ఏప్రియల్ 2016 (20:16 IST)

పెయిన్ క్లినిక్స్... ఏం చేస్తారూ...?

ఇప్పుడు తాత్కాలిక, దీర్ఘకాలిక నొప్పి నివారణకు ప్రత్యేకంగా నొప్పి నివారణ క్లినిక్స్ అందుబాటులోకి వచ్చాయి/వస్తున్నాయి. నొప్పిని నియంత్రించేందుకు ప్రత్యేకమైన డాక్టర్లు ఉన్నారు. వీళ్లు నొప్పి నివారణ ప్రక్రియలు/ పద్ధతుల్లో దీర్ఘకాలికంగా ప్రత్యేకశిక్షణ పొంది ఉంటారు.
 
నొప్పి నివారణ జరగాల్సిన తక్షణ అవసరాలు 
క్రికెట్ ఆటలో ఎవరైనా గాయపడగానే పరుగుపరుగున శిక్షణ పొందిన నిపుణులు, ఫిజియోలు వచ్చేస్తుంటారు. అంటే ఆటల్లో తగిలే దెబ్బల కారణంగా నొప్పిని తక్షణం నివారించడం అవసరమవుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఆటగాళ్లకు దీర్ఘకాలికమైన నొప్పులు కలుగుతుంటాయి. వీటికోసం వారు నొప్పి నివారణ (పెయిన్ మేనేజ్‌మెంట్) స్పెషలిస్టులను సంప్రదిస్తుంటారు. 
 
ఇదేగాక ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు, ప్రకృతి వైపరిత్యాలు, ఉత్పాతాల సమయంలో అత్యవసరంగా చేయాల్సింది నొప్పినివారణే. అందుకు తక్షణం అవసరమయ్యేది నొప్పి నివారణ స్పెషలిస్టులే.
 
నొప్పి నివారణతో సంబంధం ఉండే ఇతర స్పెషాలిటీస్...
నొప్పి నివారణ మాత్రమే గాక... దీనితో పాటు వైద్య విభాగంలోని మరికొన్ని ప్రత్యేక విభాగాలూ పనిచేయాల్సి ఉంటుంది. అంటే నొప్పిని తగ్గించగానే సరిపోదు. దానికి కారణమైన అంశాన్ని పూర్తిగా నయం చేయాలి. ఇందుకోసం అవసరమైన ఆయా విభాగాలకు చెందిన ప్రత్యేక నైపుణ్యంగల డాక్టర్లు ఆయా బాధ్యతలను నిర్వహిస్తారు. ఇక నొప్పి నివారణ కార్యకలాపాల్లో నొప్పి నివారణ స్పెషలిస్టులతో పాటు అవసరాన్ని బట్టి ఫిజియోథెరపిస్టులు, నొప్పి పూర్తిగా తగ్గాక రోగిలో కలిగిన వైకల్యాన్ని బట్టి అతడికి తగిన వృత్తిని ఎంచుకునేందుకు సహాయపడే ఆక్యుపేషనల్ థెరపిస్టులు, అవసరాన్ని బట్టి సైకాలజిస్టు వంటి వారు పేషెంట్‌కు సహాయపడతారు. 
 
నొప్పి త్వరగా తగ్గడానికి అవసరమైన వ్యాయామాలను ఫిజియో థెరపిస్టులు సూచిస్తారు. వారికి అవసరమైన ఆహారాన్ని డైట్ స్పెషలిస్టులు లేదా న్యూట్రిషనిస్టులు చెబుతారు. ఇక నొప్పి నివారణలో భాగంగా జీవనశైలిలో మార్పులు (లైఫ్‌స్టైల్ మాడిఫికేషన్స్), పనిచేసే చోట నొప్పికి ఆస్కారం లేకుండా అనువైన విధంగా కూర్చోవడం, ఉపకరణాలు, అమరికలను ఎర్గానమిస్టులు సూచిస్తారు. దీనితోపాటు పని పూర్తయ్యాక విశ్రాంతి చర్యలను, ఒత్తిడికి గురికాకుండా ఉండే మార్గాలను (రిలాక్సేషన్ టెక్నిక్స్) సైతం నిపుణులు సూచిస్తుంటారు.