దేశంలోనే తొలి బయోనిక్ హ్యాండ్.. సహజసిద్ధమైన చేతుల్లానే..

Gayatri
జె| Last Modified శుక్రవారం, 4 డిశెంబరు 2020 (21:05 IST)
అంగవైకల్యం ఎవరికీ శాపం కారాదని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు బర్డ్ ఆసుపత్రిని దేశంలోనే అత్యున్నత సేవలు అందించే ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. బర్డ్ ఆసుపత్రి సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోనే తొలి బయోనిక్ హ్యాండ్‌ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, 1985 నుంచి బర్డ్ ఆసుపత్రి ఉన్నత ప్రమాణాలతో పేదలకు సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో గొప్ప ఆర్థోపెడిక్ ఆసుపత్రిగా పేరు సాధించిందని చెప్పారు. సర్జరీలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశం మేరకు కృత్రిమ అవయవాల తయారీ లోను, వికలాంగులకు శిక్షణ లోను దేశంలో నెంబర్ 1 ఆసుపత్రిగా తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి బయోనిక్ హ్యాండ్ 'కల్ఆర్మ్'ను తను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఇది తనకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు.

దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్పూర్తితో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మేకర్స్ హైవ్ ఇన్నోవేషన్స్ సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. ఇతర దేశాల్లో 35 నుంచి 40 లక్షల ఖర్చయ్యే బయోనిక్ హ్యాండ్‌ను మేకర్స్ హైవ్ సంస్థ రూ.2.75 లక్షల లోపు ఖర్చుతోనే అందుబాటులోకి తేవడం సంతోషమన్నారు.

దీనివల్ల వికలాంగుల సమస్యకు పరిష్కారం ల‌భించి వారి జీవితాల్లో మార్పు వ‌స్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. టీటీడీ నేతృత్వంలో నడుస్తున్న బ‌ర్డ్ ఆసుప‌త్రిలో బయోనిక్ హ్యాండ్‌ను ప్రారంభించడం ఆనందకరమన్నారు. టీటీడీ ఆధ్వ‌ర్యంలో నడుస్తున్న ప్రాణదానం పథకం ద్వారా పేదలకు వీలైనంత మేరకు ఉచితంగా వీటిని అందించే ప్రయత్నం చేస్తామన్నారు. దాతల ద్వారా కూడా కొందరికి ఈ సహాయం అందించే ఆలోచన చేస్తామని సుబ్బారెడ్డి చెప్పారు.

కళ్ళు లేని వారికి చూపు తెప్పించే బయోనిక్ కళ్ళు తయారుచేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించడం అభినందనీయమన్నారు. అప్ప‌ర్ లింబ్ చికిత్స ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌త్యేక ప్ర‌తిభావంతుల్లో ఆత్మ‌స్థైర్యాన్ని నింపి వారికి వృత్తిప‌ర‌మైన అవ‌కాశాలు క‌ల్పించేందుకు, అనేకమంది జీవితాలను మార్చడానికి బయోనిక్ హ్యాండ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దేశంలో తొలిసారి ఈ బయోనిక్ హ్యాండ్ అందించిన హైదరాబాద్‌కు చెందిన గాయత్రితో చైర్మన్ మాట్లాడి ఆమెను ఆశీర్వదించారు.

కల్ఆర్మ్ బయోనిక్ హ్యాండ్ పూర్తి స్వదేశీ ప‌రిజ్ఞానంతో త‌యారుచేయడం సంతోషమన్నారు. హైవ్ సంస్థ సహకారంతో బ‌ర్డ్ ఆసుపత్రిలో ఒక యాంప్యూటీ ఫిట్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను క‌ల్పిస్తామని ఆయన చెప్పారు.
బర్డ్ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మేకర్స్ హైవ్ సంస్థ తయారుచేసిన బయోనిక్ హ్యాండ్ సాధారణ మనుషులు చేసే అన్ని పనులు చేయగలదని అన్నారు. 8 కిలోల బరువు ఎత్తగలిగేలా తయారుచేసిన బయోనిక్ హ్యాండ్ ఎలా పని చేస్తుందనే విషయాలను సంస్థ ప్రతినిధులు ప్రణవ్, విశ్వనాథ్ వివరించారు. 18 రకాల గ్రిప్‌లతో ఉపయోగించగలిగే ఈ హ్యాండ్‌ను వికలాంగులకు అవసరమైన కొలతల్లో తయారుచేస్తామని తెలిపారు.దీనిపై మరింత చదవండి :