శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (10:54 IST)

రోజువారీ ఆహారంలో ఆకుకూరలు చేర్చుకుంటే..?

రోజువారీ ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. పచ్చగా ఉండే ఆకుకూరలను భోజనంలో భాగంగా తీసుకునే వారికి ఇతరులతో పోలిస్తే మంచి పోషకాలు శరీరానికి అందడంతో పాటు వారి ఆరోగ్యం సైతం చక్కగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 
 
ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన వివిధ పోషకాలతో పాటు కంటి చూపుకు అవసరమైన విటమిన్లు సైతం అందుతాయి. అందుకే ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకునే వారికి మంచి కంటిచూపు లభిస్తుంది. అలాగే శరీరంలో ఏర్పడే రక్తహీనత నుంచి కాపాడుకోవడానికి కూడా ఆకుకూరలు ఉపయోగపడుతాయి. ఆకుకూరల్లో ఉండే ఇనుము వల్ల శరీరంలో రక్తం వృద్ధి చెందడానికి వీలు ఏర్పడుతుంది. 
 
ప్రస్తుత కాలంలో ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి పెరిగిపోవడంతో మనుషులను వివిధ రకాల సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు లాంటివి నేటికాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. వీటికి కారణం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు కరువవడమే. 
 
మనం సమతుల్య ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ప్రారంభిస్తే దాదాపు చాలా రోగాలను అదుపులో పెట్టగలం. మనకు అవసరమైన సమతుల్య ఆహారంలో ఆకుకూరల పాత్ర చెప్పుకోతగ్గది. ఒక్కోరకమైన ఆకుకూరలో ఒక్కోరకమైన విటమిన్లు, పోషకాలు ఉంటాయి. అందువల్ల అన్ని రకాల ఆకుకూరలను ఆహారంలో ఉండేలా చూచుకుంటే ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోగలం. 
 
ఆకుకూరలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన గుండె పనితీరు సైతం మెరగుపడే అవకాశముందని ఇటీవలి పరిశోధనల్లో కనుగొన్నారు. క్రమం తప్పకుండా ఆకుకూరలన్ని తినడం వల్ల భవిష్యత్‌లో గుండె సమస్యలు వచ్చే అవకాశాల్ని చాలావరకు తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 
 
ఆకుకూరల్లో ఉండే నైట్రేట్‌లు గుండె సామర్థ్యాన్ని పెంచే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఆకుకూరలతో గుండెను సైతం కాపాడుకోవచ్చు. కాబట్టి చక్కని ఆరోగ్యానికి అన్ని రకాల ఆకుకూరల్ని ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.