గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. యోగాసనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 21 జులై 2021 (23:22 IST)

యువత కార్యరంగంలో రాణించడమే యోగమౌతుంది

మనిషి అస్తిత్వంలో నాలుగు అంశాలు ఉన్నాయి. అవి దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ. మనిషి ఈ నాలుగింటిని ఆధారం చేసుకొని కర్మలు చేస్తాడు. మనిషి వీటిలో మూడవదైన బుద్ధి ద్వారానే కార్యాచరణ లేదా కార్యసాధన జరుగుతుంది. కానీ మనస్సు చంచలత కారణంగా బుద్ధి గతి తప్పి లక్ష్యసాధన తప్పిపోతుంది.
 
అందుకే భగవద్గీతలో గీతచార్యుడు యోగానికి ఒక నిర్వచనాన్ని చెప్పాడు. యోగః కర్మసు కౌశలమ్.. కర్మలో నేర్పరితనమే యోగము. యోగ వృద్ధులకే కానీ మాకెందుకు అని విద్యార్థులు, యువత అనుకునే అవకాశం ఉంది. మనస్సుపై ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా ఎంతైన అవసరము. ప్రస్తుత కాలంలో విద్యార్ధులకు మనస్సు ఏకాగ్రత ఎంతో అవసరం.
 
ఒక విద్యార్ధి చదువులో నూటికి నూరు మార్కులు సాధిస్తున్నాడంటే మనస్సును నిగ్రహించే ఆ కార్యాన్ని సాధించాడని చెప్పవచ్చు. సాధారణంగా యువత, విద్యార్థులను తప్పుదోవ పట్టించేవి ఇంటర్నెట్, వాట్సప్ సంభాషణలు, ఫేస్ బుక్‌లో కాలం గడపడం, వీడియోలు చూడటం, మత్తు పదార్ధాలకు అలవాటు పడటం. ముఖ్యంగా లక్ష్యం లేకపోవడం. ఇవన్నీ చంచలమైన మనస్సు ద్వారా కలిగేవి.
 
కానీ ఏ విద్యార్థియైనా చదువులో సంపూర్ణ విజయాన్ని సాధిస్తున్నాడంటే, మానసిక ప్రలోభాల నుండి అతడు బయటపడినట్లేనని తెలిసుకోవాలి. అప్పుడు అతడు పూర్తిగా బుద్ధి స్ధాయిలోనే ఉంటాడు. అతడు సాధించలేని కార్యమే ఉండదు. విద్యార్ధులకు, యువతకు తమ కార్యరంగంలో రాణించడమే యోగమౌతుంది. మన లక్ష్యసాధనకు అడ్డుపడే మనస్సును నిగ్రహించు కోవాలి. మనస్సును నిగ్రహించడం వలన ఉన్నత స్థితిని చేరుకోగలం. కర్మలను తగ్గించుకోవచ్చు.