శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : బుధవారం, 1 జులై 2015 (12:39 IST)

నేటి నుంచి గోదారమ్మకు నిత్యహారతి

పుష్కరాలు ఇంకా 14 రోజులు ఉన్నా అప్పుడే గోదావరికి పుష్కరశోభ వచ్చేసింది. అధికారులు పుష్కరహారతి ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యహారతిని ప్రారంభించనున్నారు. 
 
ఈనెల 14 నుంచి గోదావరి పుష్కరాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఒకటో తేదీ నుంచే ఆధ్యాత్మిక శోభ సంతరించుకోవాలన్న ఉద్దేశంతో పుష్కర హారతిని ప్రవేశపెడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. దీన్ని ప్రభుత్వం, బుద్ధవరపు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్త నిర్వహణలో నిత్యహారతి ఇవ్వనున్నారు. 
 
రాజమండ్రికి వడ్డాణాలుగా కీర్తించబడుతున్న హేవలాక్‌, ఆర్చీ వంతెన మధ్య నదిలో హారతి ఇచ్చేందుకు జిల్లా యంత్రాగం ఏర్పాట్లు చేసింది. దీంతోపాటు ఉదయం నుంచి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హారతి క్రతువు ముగిసిన తరువాత అరగంట పాటు బాణసంచా వెలుగులతో రాజమహేంద్రి కళకళలాడేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పుష్కర ఘాట్‌ను సుందరంగా తీర్చిదిద్దారు.