శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By Selvi
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (14:44 IST)

శ్రీరాముని వ్యక్తిత్వ లక్షణాల్లో ఒక్క శాతమైనా ప్రజల్లో ఉంటే?

రామాయణంలో, భాగవతంలో ఆచరణీయమైన, అనుసరణీయమైన అనేక వ్యక్తిత్వాలు, సంస్కార వంతమైన పాత్రలున్నాయి. చక్కని సమాజాన్ని, దాంపత్య ధర్మాన్ని, తల్లీకొడుకుల అనుబంధాన్ని, సోదర సంబంధాన్ని, స్నేహ బంధాన్ని అద్భుతంగా విశ్లేషించే రామాయణ మహాకావ్యంలోని అయోధ్యకాండలో రాముని సంస్కారాన్ని మన కళ్ళముందు కదలాడేలా వాల్మీకి ఆవిష్కరించారు. 
 
శ్రీరామచంద్రుడు నిత్యం సత్యం మాత్రమే పలికేవాడు. ప్రశాంతమైన అంతరంగం కలవాడు. తొణికేవాడు వాడు. బెణికేవాడు కాదు. మృదు మధురమైన సంభాషణ చేసేవాడు. ఎవరైనా కఠినంగా మాట్లాడితే, తిరిగి జవాబిచ్చే వాడు కాడు. విని ఉపేక్షించేవాడు. 
 
శ్రీరాముడు చక్కని బుద్ధి గలవాడు. మధురమైన వాక్కులు గలవాడు. ఎవరినైనా తానే ముందుగా పలకరించే వాడు. తాను ఎంత బలవంతుడైనా, ఏమాత్రం బలగర్వం లేని వినయశీలి అని వాల్మీకి ప్రస్తుతిస్తాడు. 
 
పట్టాభిషిక్తుడు కావలసిన తాను, వనవాసం వెళ్ళవలసి వచ్చినందుకు రాముడు చింతించలేదు. కైకేయిని నిందించలేదు. కైకేయిని నిందించలేదు. అమ్మా! ఎవ్వరూ అడగకుండానే నేను సీతనుగాని, రాజ్యాన్నిగాని, ప్రాణాలనుగానీ, ధనాన్నిగానీ సంతోషంగా తమ్ముడు భరతునకు ఇచ్చివేస్తాను. 
 
అమ్మా! నాకు ధనాశ లేదు. లోకులను నా వైపు త్రిప్పుకోవాలని కోరుకోవడం లేదు. నేను కేవలం ధర్మపరుడైన ఋషివంటి వాడినని శ్రీరాముడు చెబుతాడు. ''సీతను రావణుడు అపహరించినాడయ్యా" అని రెక్కలు తెగిపోయిన జటాయువు వివరిస్తుంటే.. జటాయువును కౌగిలించుకుని విలపించే రాము ఇలా అంటాడు. 
 
లక్ష్మణా! పశుపక్ష్యాదులతో కూడా శరణమిచ్చే ధర్మాత్ములు, సాధువులు అన్నిచోట్లా కనబడుతుంటారు. ఆత్మీయుడైన జటాయువు దెబ్బతిన్నాడు. నా దురదృష్టం ఎంత గొప్పది? పక్షిరాజా! నాచే సంస్కారము పొందిన నువ్వు యజ్ఞం చేసినవారు, పునర్జన్మ లేనివారూ, భూదానం చేసినవారూ ఏ ఉత్తమలోకాలు పొందుతారో.. ఆ లోకానికే నువ్వు వెళ్ళగల"వని దహన సంస్కారాలు చేస్తాడు. 
 
ఆత్మగత, జన్మగత సంస్కారానికి, తల్లిదండ్రుల పెంపకంలో, గురువుల విద్యాభ్యాస క్రమశిక్షణలో పరిణతి చెందిన వ్యక్తిత్వాన్నే ఏ సమాజమైనా కోరుకుంటుంది. అటువంటి వ్యక్తిత్వానికి శ్రీరామచంద్రమూర్తి ప్రథమ ఉదాహరణగా గోచరిస్తాడు. ఆయన వ్యక్తిత్వ లక్షణాలలో ఒక శాతాన్ని అయినా నేటి ప్రజలు పాటించగలిగితే.. ఓ ఉత్తమ సమాజం మన కళ్ళముందుంటుంది.