శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By దీవి రామాచార్యులు (రాంబాబు)
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2015 (17:19 IST)

సీతారామలక్ష్మణుల అరణ్యవాసం: రాక్షసులను సీత ఎందుకు చంపవద్దన్నదో తెలుసా?

సుమంత్రుడు తీసుకుని వచ్చిన రథంలో ముందుగా చక్కగా అలంకరించుకుని లక్ష్మీదేవిలా వున్న సీత ఎక్కింది. తరువాత రాముడు, లక్ష్మణుడు ఎక్కారు. సుమంత్రుడు రథాన్ని కదపగానే అయోధ్య పట్టణం ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోయింది. ప్రజలతో  పాటు జంతువులు, పక్షులు దిక్కు తెలియని పరిస్థితులలో అటు ఇటూ పరిగెత్తాయి. 
 
ప్రజలందరూ సుమంత్రుణ్ణి రథం మెల్లగా తీసుకుని పొమ్మన్నారు. మరల రాముణ్ణి ఎప్పుడు చూస్తామో అని అందరూ కళ్లు ఆర్పకుండా సీతా రామలక్ష్మణులను చూస్తూ దుఃఖములో మునిగిపోయారు. అలా అడవులకు ప్రయాణమయిన సీతారామ లక్ష్మణులు కొంతదూరం వెళ్ళిన తర్వాత తమతో వచ్చిన అయోధ్య ప్రజలను, సుమంత్రుణ్ణి వెనక్కు పంపేశారు. ఆ తర్వాత వారు ముగ్గురూ అడవులలో ప్రయాణం సాగించారు.
 
సాధారణంగా మన ఇళ్లల్లో వున్న ఆడవాళ్ళు చిన్న చిన్న కష్టాలకు లేదా కోరికలు తీరడానికి చాలా తొందరగా దేవుళ్ళకు మొక్కుకుంటారు. అది కూడా భర్తకు తెలియకుండా మొక్కుకుంటారు. తర్వాత కొంత కాలానికి ఆ మొక్కులను మరిచిపోతారు. ఎప్పుడో గుర్తుకు వచ్చినప్పుడు ఆ విషయాన్ని భర్తకు చెబుతారు. అలాగే గంగానదిని పడవలో దాటేటప్పుడు సీత కూడా దేవతలకు మొక్కుకున్నది (11 52-87.91). 
 
పురుష శ్రేష్ఠుడైన రాముడు సుఖముగా నదిని దాటి అరణ్యవాసము పూర్తిచేసుకుని తిరిగివచ్చి రాజ్యమును పొందిన తర్వాత మీ సంతోషము కొరకు బ్రాహ్మణులకు గోవులను, వస్త్రములను, మంచి భోజనమును పెట్టెదనని'' మొక్కుకున్నది (11-55-19,20).
 
రాముడు, సీత, లక్ష్మణుడు కొంతదూరం వెళ్లిన తర్వాత వారు ఒక విశిష్టమైన శ్యామ అనే చెట్టును దాటుకుంటూ వెళ్లారు. అక్కడ మళ్లీ సీత ఇలా వేడుకున్నది. '' ఓ మహా వృక్షమా! నీకు నమస్కారము. నా భర్త తన వ్రతమును అంటే 14 సంవత్సరాలు వనవాసము పూర్తి చేయుగాక! నేను మరల అయోధ్యను చేరి, కౌసల్యను, కీర్తిమంతురాలైన సుమిత్రను చూచెదనుగాక!" అని నమస్కరించుకున్నది. (11-55-24,25)
 
తిరిగి అయోధ్యను చేరిన తర్వాత సీత, కౌసల్యను, సుమిత్రను చూడాలనుకున్నది కానీ కైకేయి పేరు ఇక్కడ ప్రస్తావించలేదు. ఒక వేళ కైకేయి ప్రేరణ మేరకే రాముడు వనవాసానికి రావలసి వచ్చిందన్న మానసిక భావన సీత మనస్సులో వుండి వుండవచ్చు. అందుకనే కైకేయి పేరును తలచుకోలేదు. 
 
రామాయణంలో చాలాచోట్ల సీతకు, ఒక సాధారణ స్త్రీకి ఎటువంటి తేడా మనకు కనబడదు. ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారో దాదాపు 20 లక్షల సంవత్సరముల ముందు జన్మించిన సీత కూడా అలాగే ప్రవర్తించింది. అందుకనే సీత ఇప్పటికీ అందరిచే ఆదర్శంగానూ, పతివ్రతగానూ పూజింపబడుతున్నది. సీత, రాముడు, లక్ష్మణుడు అడవిలో మునులు చేత సత్కరింపబడుతూ ప్రయాణం సాగించారు. 
 
మధ్యలో విరాధుడు తటస్థపడటం అతన్ని రామలక్ష్మణులు వధించడం జరిగింది. అలా ఆ ముగ్గురూ వెళ్తూ వుండగా అల్లంత దూరంలో ఆకాశంలో రథంలో ఇంద్రుడు కూర్చుని చుట్టు ప్రహరిగోడలాగ దేవతలు కనబడ్డారు. వారికి ఎదురుగా ఒక మహర్షి కూర్చుని వున్నాడు. ఇంద్రుడు మరియు ఇంతమంది దేవతలు స్వయంగా క్రిందికి వచ్చి ఒక మహర్షితో సంభాషిస్తున్నారంటే ఆ మహర్షి చాలా గొప్పవాడై వుంటాడు అనుకుని రాముడు కొంచెం ముందుకు వెళ్ళాడు. అది చూసిన ఇంద్రుడు తొందర తొందరగా తన సంభాషణలను ముగించుకొని దేవతలతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత రాముడు ఆ మహర్షి వద్దకు వెళ్ళి అతను శరభంగమహర్షి అనీ అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ వద్దకు తీసుకునిపోవుటకై ఇంద్రుడు వచ్చాడనీ తెలుసుకున్నాడు. 
 
శరభంగమహర్షి రాముడితో ఇలా అన్నాడు.
''నరులలో శ్రేష్టుడైన ఓ రామా! నీవు నాకు దగ్గరగా వున్నట్లు తెలుసుకుని, ప్రియ అతిథివైన నిన్ను చూడకుండా బ్రహ్మలోకమునకు వెళ్ళుటకు నేను అంగీకరించలేదు. (111 5-29) నేను తపస్సుచేత బ్రహ్మకు సంబంధించి పుణ్యలోకములను, స్వర్గమునకు సంబంధించిన పుణ్యలోకములను జయించితిని. వాటిని నీకిచ్చెదను స్వీకరింపుము. (11 5-31)
 
పురుషశ్రేష్టుడవు, ధార్మికుడవు, మహాత్ముడవు అయిన నిన్ను కలిసిన పిమ్మట నేను బ్రహ్మ లోకమును వెళ్ళగోరుచున్నాను'' శరభంగ మహర్షి మాటలు విన్న రాముడు ''మహామునీ, నీవు చెప్పిన ఆ పుణ్యలోకములు అన్ని నేనే సంపాదించుకొంటాను. నీవు నాకు ఈ వనములో ఏదైనా నివాస యోగ్యమైన ప్రదేశమును చూపించిన చాలును" (111 5-38) అని ప్రార్థించెను. 
 
శరభంగ మహర్షి చెప్పినట్లుగా సీత, రాముడు, లక్ష్మణుడు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి బయలుదేరారు. మార్గమధ్యంలో కొంతమంది మునులు రాముడిని కలిసి తమని రాక్షసుల బారినుండి కాపాడమని వేడుకున్నారు. వారిలో విఖనస ధర్మశాస్త్రములను అనుసరించు వైఖానసులను వానప్రస్తులు, చంద్రకిరణములను ఆహారము తీసుకొనువారు, జలము మాత్రమే ఆహారముగా తీసుకొనువారు ఈ విధముగా అనేక విధములుగా తపస్సు చేయు మునులు వున్నారు. (111-6-2-8) ధర్మమునందు స్థిరబుద్ధిగల, వీరుడైన రాముడు మునులకు అభయమిచ్చి లక్ష్మణునితోను, మునులతోను కలిసి సతీసమేతుడై సుతీక్ష్ణ మహర్షి వద్దకు వెళ్ళెను. అక్కడ ఆ మహర్షి ఆతిథ్యం స్వీకరించి ముందుకు సాగెను. 
 
అరణ్యకాండ 9వ సర్గలో సీత, రామునికి అహింసాధర్మాన్ని చెబుతుంది. ఇక్కడ సీతయొక్క మాట చాతుర్యాన్ని చూడవచ్చు. భర్తకు ఏదైనా విషయం చెప్పాలి అంటే ఎలా చెప్పాలి. అని సీతను చూసి నేర్చుకోవాలి. 
 
రామునితో సీత ఇలా అన్నది.. 
''కామము వలన కలుగు వ్యసనములు మూడు. వాటిలో అసత్య వాక్యము పలుకుట చాలా పెద్ద వ్యసనము. పరభాగ్యాగమనము, వైరము లేకుండానే క్రూరముగా ప్రవర్తించుట అంతకన్నా చాలా చెడ్డది. అసత్యవాక్యమును ఇంతకు ముందు ఎన్నడూ నీవెరుగవు. ఇకమీదట కూడా అది నీకు వుండదు. ధర్మనాశనమునకు హేతువైన పరస్త్రీ వాంఛ నీకు ఉండుట అసంభవము. ధర్మము, సత్యము నీయందు వున్నవి. ఇక సద్గుణములు కూడా నీయందు స్థిరముగా ఉన్నవి. కానీ వైరమేమీ లేకుండగానే, అజ్ఞానముచేత పరుల ప్రాణములను తీయుట అనే మూడవదైన భయంకరమైన వ్యసనము ఇప్పుడు నీకు ఆకస్మికముగా వచ్చినది. 
 
మునులను రక్షించుటకై యుద్ధములో రాక్షసులను సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసి మాట ఇచ్చావు. దానిని పూర్తి చేసేందుకు లక్ష్మణునితో కలిసి దండకారణ్యమునకు బయలుదేరినావు. కానీ అది నాకిష్టము లేదు. ఎందుకంటే ధనస్సు ధరించిన నీకు దండకారణ్యములో నివసించు రాక్షసులను వాళ్ళతో వైరము లేకుండగానే చంపవలెనన్న ఆలోచన కలుగుట ఏమాత్రం మంచిది కాదు. ఏ అపరాధము చేయని జనులను చంపుట నాకు సమ్మతము కాదు''. (111 9,3-25) అని చెప్పవలసిన విషయాన్ని అంతా రామునికి చెప్పి ''నీపై నాకున్న ప్రేమచేతను, గౌరవభావముచేతను నీకు నేను ఈ విషయములను గుర్తుచేయుచున్నానే కానీ మీకు తెలియని విషయముగా చెప్పుట లేదు" అని చెబుతూ (111 9, 24) ''స్త్రీ సహజమైన చపలత్వము చేత ఇది చెప్పుచున్నాను. కానీ నీకు ధర్మమును బోధించగలవారెవ్వరు. మీ బుద్ధిచేత పరిశీలించి, నీ తమ్మునితో కూడా ఆలోచించి ఎట్లు ఇష్టమో అట్లు చేయుము. ఆలస్యము చేయవద్దు" అని చెప్పెను. (111 9,33)
 
సీత తన మనస్సులోని విషయాన్ని ధైర్యంగా తన భర్తయైన రామునికి చెప్పినది. తాను చెప్పిన విషయాన్ని గానీ, సలహాను గానీ రాముడు తప్పకుండా అవలంభించాలని పట్టుదలతో రాముడిని ఇబ్బంది పెట్టలేదు. రాముడు ధర్మానికి ఎంత విలువనిస్తాడో, ధర్మమంటే రాముడికి ఎంత ఇష్టమో సీతకు బాగా తెలుసు. భర్తపై వున్న ప్రేమతో భార్య ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడినది. 
 
తర్వాత సుతీష్ణుని ఆదేశానుసారం సీత రామలక్ష్మణులు అగస్త్యుని ఆశ్రమమునకు చేరారు. అక్కడ అగస్త్యుని ఆతిథ్యం స్వీకరించి అతను ఇచ్చిన శ్రేష్ఠములైన ఆయుధములను తీసుకొన్నారు. అగస్త్యుని మాట ప్రకారము అక్కడ నుండి బయలుదేరి సీతారామలక్ష్మణులు పంచవటిలో నివసించుటకు ప్రయాణమయ్యారు. పంచవటి చేరిన పిమ్మట ఎత్తుపల్లములు లేకుండవున్న ప్రదేశములను చూసి అక్కడ పర్ణశాలను నిర్మించుకుని నివాసము ఏర్పరుచుకున్నారు. 
 
కొంతకాలము తర్వాత గోదావరి నదిలో స్నానము చేసి రాముడు, సీత లక్ష్మణుడు తమ పర్ణశాలకు వెళ్ళారు. అక్కడ శూర్పణఖ అనే పేరుగల రాక్షస స్త్రీ రాముణ్ణి చూసింది. ఆమె రావణుడనే రాక్షసుని చెల్లెలు. ఆ రాక్షసి రాముణ్ణి చూడగానే మన్మథునిచే ఆవహింపబడినదై తొలిసారిగా చూసినది మొదలు, ''పురుషులలో శ్రేష్టుడైన నిన్ను మనోభావముచేత భర్తగా పొందినాను'' అని చెప్పెను. ఆ మాటలు విన్న రాముడు నవ్వుచు శూర్పణఖతో '' నాకు వివాహమయినది. నీకు తగ్గ మగవాడు, వీరుడు అదుగో అక్కడ వున్నాడు'' అని లక్ష్మణుని చూపించెను. శూర్పణఖ లక్ష్మణుని వద్దకు వెళ్ళెను.
 
"నేను రామునికి సేవకుడను, నన్ను పెళ్ళి చేసుకొనినచో నీవు కూడా దాసిగా వుండవలసినదే. కాబట్టి రెండవ భార్య అయినను రాముణ్ణే వివాహమాడుట మంచిది'' అని లక్ష్మణుడు చెప్పెను. అది విన్న శూర్పణఖ సీతపైన అసూయతో ఆమెను చంప ప్రయత్నించెను. అప్పుడు రాముడి ఆజ్ఞతో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసెను. శూర్పణఖ ఏడుస్తూ తన అవమానాన్ని తన అన్న అయిన ఖరుడికి చెప్పింది. 
 
ఖరుడు, దూషణుడు, త్రిసముడు 14వేలమంది రాక్షసులతో రాముణ్ణి చంపుటకు బయలుదేరిరి. భయంకరమైన వారి రూపములను చూసి రాముడు లక్ష్మణునితో సీతను ఎక్కడైనా క్షేమముగా ఒక గుహలో ఉంచుమని ఆదేశించెను. ప్రక్కనే వున్న చెట్ల మధ్య వున్న ఒక చిన్న గుహలో సీతను వుంచి లక్ష్మణుడు క్షేమంగా చూసుకునెను. రామడు వారితో ఘోరయుద్ధము చేసి, ఖర, దూషణ, త్రిసురలను, 14వేల మంది రాక్షసులను హతమార్చెను. ప్రత్యక్షంగా రామునియొక్క వీరత్వాన్ని బలపరాక్రమములు చూసిన సీత రాముడు రాక్షసులను హతమార్చెను. 
 
ప్రత్యక్షంగా రామునియొక్క వీరత్వాన్ని బలపరాక్రమములు చూసిన సీత రాముడు రాక్షసులను చంపి తన వద్దకు వచ్చిన వెంటనే ఎంతో సంతోషముతో రాముడిని గట్టిగా కౌగిలించుకొనెను. తన అన్నలు చనిపోయినందున శూర్పణఖ అవమానం భరించలేక ఏడుస్తూ తన అన్న రావణుడి చెప్పి.. ఎలాగైనా సీతను తీసుకుని వచ్చి నువ్వు వివాహమాడవలెను అని రావణునికి చెప్పెను.