శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By PYR
Last Updated : సోమవారం, 26 జనవరి 2015 (08:43 IST)

ఆహా... ఏడు వాహనాలపై ఏడుకొండలవాడు.. తిరుమలలో రథసప్తమి ప్రారంభం

మినీ బ్రహ్మోత్సవంగా పేరు పొందిన రథసప్తమి తిరుమలలో సోమవారం ఉదయం ఆరంభమయ్యింది. ఈ ఉత్సవంలో ఒకే రోజు శ్రీవారు ఏడు వాహనల్లో విహరిస్తారు. అందుకే దీనికి మినీ బ్రహ్మోత్సవంగా పేరు. ఇలా ఏడు వాహనాలలో విహరించే శ్రీవారిని దర్శించి తరించేందుకు భక్తులు అశేషంగా తరలి వచ్చారు. ఉదయం 5.30 గంటల నుంచి స్వా మి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనాలపై విహరిస్తున్నారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
 
ఆలయం వద్ద, నాలుగు మాడ వీధుల్లో ప్రత్యేక బ్యారికేడ్లు, గ్యాలరీలు, చలువ పందిళ్లు నిర్మించారు. గాలరీల్లో ఉంటూ వాహన సేవలను తిలకించే భక్తులకు అన్న ప్రసాదాలు, మజ్జిగ, నీళ్లు, వేడిపాలు అందజేయనున్నారు. ఏకదాటిగా  ఏడు వాహ సేవలు ఉండడంతో  కచ్చితమైన సమయాభావాన్ని పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3  మధ్యలో  పుష్కరిణిలో చక్రస్నానం జరుగనుంది.

సుదర్శన చక్రతాళ్వారు స్నానమాచరించే పుణ్యప్రదేశంలో సాధారణ భక్తులు చొరబడకుండా ఇనుప కమ్మీలు నిర్మించారు. తిరుమల భక్త జనంతో కళకళలాడుతోంది. రథసప్తమి సందర్భంగా విఐపి బ్రేకు దర్శనాలను నిలిపేశారు.