గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By chitra
Last Updated : శనివారం, 2 జనవరి 2016 (13:29 IST)

సగ్గుబియ్యం వడలు తయారీ ఎలా?

సగ్గుబియ్యాన్ని సాబ్దానా అని కూడా అంటారు. సాబ్దానా మూత్రంలో మంటని తగ్గిస్తుంది. జ్వరం, వడదెబ్బ వంటి వాటి బారినుండి కాపాడుతుంది. కొన్నిరకాల అనారోగ్యాలకు సగ్గుబియ్యం దివ్యౌషదం. సగ్గుబియ్యంతో హాట్లు, స్వీట్లు, నిలువపదార్థాలు ఎన్నోతయారుచేసుకోవచ్చు. అలాంటి హాట్ వంటకమైన సగ్గుబియ్యం వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం!
 
కావలసిన పదార్ధాలు:
 
సగ్గుబియ్యం : అరకిలో
ఉల్లిపాయలు : 2 పెద్దవి
అల్లం : తగినంత
జీలకర్ర: 1 స్పూన్
వంటసోడా : చిటికెడు
వేరుశనగ పప్పు : అర కప్పు
పచ్చిమిర్చి : 6 సన్నవి
నూనె : వేయించటానికి సరిపడా
కొత్తిమీర: ఒక కట్ట
కరివేపాకు: రెండు రెబ్బలు
ఉప్పు : రుచికి తగినంత
 
తయారు చేసే విధానం: 
 
ముందుగా సగ్గుబియ్యం రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. వేరుసెనగపప్పు వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు చిన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.

సగ్గుబియ్యం బాగా నానిన తరువాత మిగతా నీటిని వంపేయాలి. ఇప్పుడు నానిన సగ్గుబియ్యాన్ని కొద్ది సేపు ఆరబెట్టాలి. ఆరిన తరువాత ఒక గిన్నెలో తీసుకొని అందులో వేరుసెనగపప్పుపొడిని, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, వంటసోడా మరియు తగినంత ఉప్పు వేసి కొద్దిగా నూనె పోసి అన్నిటిని బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు గ్యాస్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో తగినంత నూనె పోసి కాగనివ్వాలి. ఇప్పుడు అరటిఆకు తీసుకొని సగ్గుబియ్యం మిశ్రమాన్నివడలాగా వత్తుకోవాలి. వడని కాగుతున్న నూనెలోవేసి దోరగా వేయించుకోవాలి. అంతే సగ్గుబియ్యం వడలు రెడీ. వీటిని టమాటో సాస్‌తో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది.