బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (09:18 IST)

క్షౌరం చేశారో.. మీ చావు మీ చేతుల్లోనే.. తాలిబన్ హుకుం

తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థాన్ దేశంలో మళ్లీ ఆటవిక పాలన మొదలైంది. ఈ దేశంలో ఉరి శిక్షలు, మహిళలపై ఆంక్షలు తదితర అరాచకాలకు పాల్పడుతున్న తాలిబన్లు.. తాజాగా పురుషుల గడ్డాలు, హేర్‌ స్టైల్స్‌ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. 
 
స్థానికుల గడ్డాలు తీయడం(షేవింగ్‌), ట్రిమ్మింగ్‌ చేయడం ఆపేయాలంటూ తాజాగా హెల్మండ్‌ ప్రావిన్స్‌లోని క్షౌరశాలలకు తాలిబన్ల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని ఓ వార్తసంస్థ నివేదించింది. ఈ పనులు ఇస్లామిక్ చట్టానికి విరుద్ధమని, మాట వినని పక్షంలో కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నట్టు తెలిపింది. 
 
తమకూ తాలిబన్ల నుంచి ఇలాంటి ఆదేశాలే వచ్చాయని కాబుల్‌లోని అనేక మంది క్షౌరశాలల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ విధులను నిలిపేయాలని పదేపదే ఒత్తిడి చేస్తున్నారని, ఈ విషయంలో ఎవరికీ ఫిర్యాదు చేసే హక్కు లేదంటూ నోటీసులూ ఇస్తున్నారని తెలిపారు.
 
‘ఒక తాలిబన్‌ అధికారి నాకు ఫోన్‌ చేసి.. అమెరికన్‌ స్టైల్స్‌ అనుసరించడం మానేయండి అని హెచ్చరించిన’ట్లు కాబుల్‌లోని ఓ ప్రముఖ సెలూన్ యజమాని వాపోయారు. అఫ్గాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తాలిబన్లు గత పాలనను గుర్తుకు తెస్తున్న విషయం తెలిసిందే. 
 
ఈ క్రమంలో శనివారం సైతం వారు హెరాత్‌ పట్టణంలోని ఓ ప్రధాన కూడలి వద్ద క్రేన్‌ సాయంతో ఓ వ్యక్తి మృతదేహాన్ని వేలాడదీశారు. అయితే తండ్రీకుమారులను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించిన దుండగుడిని మట్టుబెట్టి ఇలా చేసినట్లు వారు పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్‌లో 1990ల నాటి తరహాలోనే ఇప్పుడూ కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని తాలిబన్లు ఈమధ్యే వెల్లడించడం గమనార్హం. 
 
తాలిబన్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా నూరుద్దీన్‌ తురాబీ మాట్లాడుతూ.. గతంలో తాము బహిరంగంగా శిక్షలను అమలు చేసినప్పుడు చాలా దేశాలు విమర్శించాయని, కానీ తామెప్పుడూ ఆయా దేశాల చట్టాలు, శిక్షల గురించి మాట్లాడలేదన్నారు. మా చట్టాలు ఎలా ఉండాలో ఇతరులు చెప్పనక్కర్లేదని, మా అంతర్గత వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదని పేర్కొన్నారు.