శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2020 (13:45 IST)

ప్రభుత్వానికి ఇబ్బంది తలెత్తకూడదనీ రాజీనామాకు సిద్ధపడిన ప్రధాని... ఎవరు?

అగ్రదేశాలకు ధీటుగా అభివృద్ధి చెందుతూ, సంపన్న దేశాలకు గట్టిపోటీ ఇస్తున్న దేశం జపాన్. ఈ దేశ ప్రధానిగా షింజో అబే కొనసాగుతున్నారు. అయితే, ఈయన తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు. 
 
గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తన అనారోగ్యం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్న పెద్ద మనస్సుతో ఆయన దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టు జపాన్ మీడియా వర్గాల సమాచారం.
 
కాగా, చాలా కాలంగా షింజో అబే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయనకు టోక్యోలోని ఓ ఆసుపత్రి వైద్యులు దాదాపు ఏడు గంటలపాటు వైద్య పరీక్షలు చేయడం చర్చనీయాంశమైంది. ప్రధాని పదవికి షింజో అబే రాజీనామా చేశాక ప్రస్తుత ఉప ప్రధాని తారో అసో తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కథనాలు వస్తున్నాయి. జపాన్‌కు అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన నేతగా అబే రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.
 
షింజో అబే హయాంలోనే జపాన్ - భారతదేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింతగా బలపడ్డాయి. అనేక అంశాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా, చైనాతో భారత్‌కు సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కూడా జపాన్ భారత్‌కు అండగా నిలిచింది. 
 
అలాగే, ఢిల్లీ - అహ్మదాబాద్ నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి షింజో అంబే ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అదేవిధంగా, రక్షణ రంగంలో కూడా ఇరు దేశాల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్న విషయం తెల్సిందే.