ఏప్రిల్ 19న భూమిని సమీపిస్తున్న గ్రహశకలం.. యుగాంతం తప్పదా?
కరోనాతో ఓ వైపు ప్రపంచం వణికిపోతున్న నేపథ్యంలో ఓ పిడుగు లాంటి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతరిక్షం నుంచి వస్తున్న ఓ పెద్ద గ్రహశకలం భూమి నుంచి దూసుకెళ్తుందని, అప్పుడు యుగాంతం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజమనేది తెలియరాలేదు.
2020 సంవత్సరంలో ఓ భారీ గ్రహ శకలం భూమికి సమీపంగా వెళ్తుందని మూడేళ్ల క్రితం నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2004 సెప్టెంబర్‌లో టౌటాటిస్ అనే గ్రహశకలం భూమి నుంచి 4 లూనార్లతో దూసుకెళ్లింది. అయితే ఏప్రిల్ 19న భూమిని సమీపించబోయే గ్రహశకలం అంతకంటే పెద్దదని తెలుస్తోంది.
అయితే అదే విషయాన్ని పట్టుకొని ఇప్పుడు కొంత మంది భూమి అంతం కాబోతోందని ప్రచారం చేస్తున్నారు. నిజానికి 2వేల అడుగుల పరిమాణం ఉన్న జేఓ25 అనే గ్రహశకలం భూమి నుంచి 1.8 మిలియన్ కిలోమీటర్ల దూరంలో దూసుకెళ్లనుందని నాసా పేర్కొంది.
ఇది చంద్రుడి నుంచి భూమికి గల మధ్య దూరానికి 4.6 రెట్లు దూరంలో పయనించనుంది. కనుక భూమిని తాకే అవకాశమే లేదని నాసా స్పష్టం చేసింది. ఈ ప్రక్రియతో ఎలాంటి ప్రమాదం లేదని నాసా తేల్చేసింది.