మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (16:50 IST)

అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి బయలుదేరిన నలుగురు వ్యోమగాములు

astronuts nasa
అమెరికాలోని కేప్ కెనవెరాల్‌లోని కెనడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నలుగురు వ్యోమగాములు తాజాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు బయలుదేరి వెళ్లారు. నలుగురు ఆస్ట్రోనట్స్‌తో కూడిన స్పేస్ ఎక్స్ రాకెట్ శనివారం నింగిలోకి దూసుకెళ్లింది. ఇది భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న ఐఎస్‌ఎస్‌‌కు వారు ఆదివారం చేరుకోనున్నారు.
 
ఈ వ్యోమనౌకలో నాసాతో పాటు డెన్మార్క్‌, జపాన్‌, రష్యాలకు చెందిన వ్యోమగాములు ఉన్నారు. నాలుగు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములను అమెరికా పంపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇప్పటివరకు ప్రతి ప్రయోగంలో నాసా.. ఇద్దరు లేదా ముగ్గురు తన వ్యోమగాములనే పంపేది. తాజాగా వెళ్లిన ఈ నలుగురు వ్యోమగాములు ఆర్నెళ్ల పాటు అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో విధులు నిర్వహించనున్నారు. 
 
నాసాకు చెందిన జాస్మిన్‌ మోఘ్‌బెలి ఈ మిషన్‌కు కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు 1979 ఇరాన్‌ విప్లవం సమయంలో జర్మనీకి వెళ్లారు. అక్కడే పుట్టిన ఆమె.. న్యూయార్క్‌లో పెరిగారు. మెరైన్‌ పైలట్‌గా ఉన్నారు. తొలిసారి అంతరిక్షంలోకి వెళ్తున్నారు. ఇరాన్‌ అమ్మాయిలూ ఏదైనా సాధిస్తారని తాను నిరూపిస్తున్నట్లు చెప్పారు. 
 
ఇకపోతే, డెన్మార్క్‌ వాసి, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ఆంద్రియాస్‌ మొగెన్‌సెన్‌.. ఆ దేశానికి చెందిన మొదటి వ్యోమగామి. జపాన్‌కు చెందిన సతోషి ఫురుకావా, రష్యాకు చెందిన కాన్‌స్టాంటిన్‌ బొరిసోవ్‌ ఇతర వ్యోమగాములు. వాస్తవానికి శుక్రవారమే ఈ ప్రయోగం జరగాల్సింది. కానీ, క్యాప్సూల్ 'లైఫ్ సపోర్ట్ సిస్టమ్' అదనపు సమీక్షల కారణంగా ప్రయోగం ఒక రోజు ఆలస్యమైంది. .