మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 ఆగస్టు 2020 (10:26 IST)

తూచ్... దావూద్ మా దేశంలో లేడు : మాట మార్చేసిన పాకిస్థాన్

పాకిస్థాన్ మరోమారు మాట మార్చేసింది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడనీ, అదీ కూడా ఓడరేవు పట్టణమైన కరాచీలోనే నివాసం ఉంటున్నాడని శనివారం ప్రకటించింది. ఈయనతో పాటు.. తమ దేశంలో తలదాచుకుంటున్న అనేక మంది ఉగ్రవాదుల పేర్లతో కూడిన జాబితాను వెల్లడించింది. అయితే, ఈ ప్రకటన చేసిన 24 గంటలైనా గడవకముదే.. పాకిస్థాన్ మాట మార్చేసింది. తూచ్.. దావూద్ మా దేశంలో లేడంటూ ప్రకటించింది. 
 
కరుడుగట్టిన ఉగ్రవాదులు, నేరస్తుల ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు విధించకపోతే అంతర్జాతీయంగా అందుతున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేసేలా బ్లాక్ లిస్టులో చేర్చుతామంటూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) చేసిన హెచ్చరింది. దీంతో పాకిస్థాన్ దిగివచ్చింది. ఎఫ్ఏటీఎఫ్ తనను బ్లాక్ లిస్టులో చేర్చకముందే పాక్ జాగ్రత్త పడింది. 
 
దావూద్ ఇబ్రహీంతో సహా ముంబై వరుస పేలుళ్లు, దాడులతో పాత్ర ఉన్న ఉగ్రవాదుల అందరిపేర్లను ప్రకటించింది. ఈ క్రమంలో ఉగ్రవాద నేతలు హఫీజ్ సయీద్, మసూద్ అజహర్‌లతో సహా మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతడి అనుచరుల ఆర్థిక కార్యకలాపాలపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. వారి ఆస్తుల జప్తుకు, బ్యాంక్ అకౌంట్ల నిలిపివేతకు ఆదేశాలు జారీ చేసింది.
 
పాక్ ఆంక్షలు విధించిన వారిలో తాలిబాన్, దాయిష్, హక్కానీ నెట్వర్క్, అల్ ఖైదా ఉగ్రవాద ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ ఆంక్షలు అన్ని స్థిర, చరాస్తులకు వర్తిస్తాయని తెలుస్తోంది. పాక్ కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో, ఉగ్రవాద సంస్థలు విదేశాలకు నగదు బదిలీ చేసి పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చుకునేందుకు ఇకపై వీలుపడదని భావిస్తున్నారు.
 
పారిస్ వేదికగా పనిచేసే ఎఫ్ఏటీఎఫ్ పాకిస్థాన్‌ను 2018లో గ్రే లిస్టులో చేర్చింది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోకపోతే బ్లాక్ లిస్టులో చేర్చుతామంటూ స్పష్టం చేసింది. అందుకు 2019 డిసెంబరును గడువుగా విధించింది. అయితే కరోనా కారణంగా ఆ డెడ్‍‌లైన్‌ను మరికాస్త పొడిగించింది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆగస్టు 18న ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ఉగ్రవాదులపై కఠిన ఆంక్షలు విధించింది. 
 
అయితే, ఈ ప్రకటన చేసిన 24 గంటలు కూడా గడవకముందే... పాకిస్థాన్ మాట మార్చేసి.. తనది నరంలేని నాలుక అని మరోమారు నిరూపించుకుంది. దావూద్ ఇబ్రహీం తమవద్ద లేడని తాజాగా ప్రకటించింది. 
 
మీడియాలో వస్తున్న వార్తలపై పాక్ విదేశాంగ శాఖ స్పందిస్తూ... దావూద్ పాకిస్థాన్‌లో ఉన్నాడన్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. తమపై కొత్త ఆంక్షలు విధించినట్లు వార్తలొస్తున్నాయని, ఆ నివేదిక శుద్ధ అబద్ధమని, దానిలో ఏమాత్రం నిజం లేదని ప్రకటించింది. 
 
దావూద్ తమవద్దే ఉన్నాడంటూ భారత మీడియా ప్రకటించిందని, అది పూర్తి నిరాధారమైనదని, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే వార్త అని పాక్ విదేశాంగ శాఖ మండిపడింది.