వణికిపోతున్న పాకిస్థాన్.. మీరే రక్షించాలంటూ ఐక్యరాజ్య సమితిలో శరణు

indo - pakistan
Last Updated: మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (15:31 IST)
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సంసిద్ధమవుతోంది. దీంతో పాకిస్థాన్ వెన్నులో వణుకు మొదలైంది. భారత్ సైనిక చర్యకు దిగకుండా శాంతింపజేయాలంటూ ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ కోరారు. ఈ మేరకు ఆయన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్‌కు లేఖ రాశారు.

"పాకిస్థాన్‌పై భారత్ తన సైన్యాన్ని ప్రయోగించే అవకాశం ఉండడంతో మా ప్రాంతంలో భద్రతా పరిస్థితి క్షీణిస్తోంది. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను" అని ఖురేషీ సదరు లేఖలో విదేశాంగ శాఖ కోరింది. కాగా కాశ్మీర్ అంశంపై మూడో పార్టీ ప్రమేయాన్ని భారత్ తిరస్కరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. భారత్-పాక్ వ్యవహారాలను కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని భారత్ స్పష్టంగా చెబుతోంది.

దేశంలోని రాజకీయ కారణాల కోసం భారత్ కావాలని తమపై శత్రు భావాన్ని ప్రదర్శించి, ఉద్రిక్తతలు పెంచుతోందని ఆయన ఆరోపించారు. ఈ నెల 14న కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 49 మంది సీఆర్‌పీఎఫ్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉందని భారత్ చెబుతుండగా... తమకు సంబంధం లేదని పాకిస్థాన్ బుకాయిస్తోంది.దీనిపై మరింత చదవండి :