రష్యాలో కరోనా విలయతాండవం... 24 గంటల్లో వెయ్యి మంది మృతి
రష్యాలో కరోనా వైరస్ మళ్లీ విలయతాండవం చేస్తుంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1002 మంది మృత్యువాతపడ్డారు. నిజానికి ఈ వైరస్ వెలుగు చూసిన తొలినాళ్ళలో అపారనష్టాన్ని ఎదుర్కొన్న దేశాల్లో రష్యా కూడా ఒకటి. ఆ తర్వాత కాస్త శాంతించింది. ఈ క్రమంలో ఇపుడు కొత్త కేసులు, మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.
తొలిసారి 24 గంటల వ్యవధిలోనే వెయ్యికి పైగా (1,002) మరణాలు నమోదయ్యాయి. 33,208 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలుపుకుని దేశ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 79.50 లక్షలకు చేరుకోగా, 2.22 లక్షల మంది కరోనాకు బలయ్యారు.
ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు, కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా ఐదో స్థానంలో నిలిచింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడం, కరోనా నిబంధనల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడమే కరోనా తాజా విజృంభణకు కారణంగా తెలుస్తోంది.