శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (22:28 IST)

టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం: డ్రాగన్ కంట్రీ ఫైర్

టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై నిషేధాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై చైనా ఆందోళన వ్యక్తంచేసింది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలను ఉల్లంఘించడమేనని విమర్శించింది. ఈ చర్యలు చైనా సంస్థల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది.

ఈ అంశంపై ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి జీ రోంగ్‌ మాట్లాడుతూ జాతీయ భద్రతను సాకుగా చూపుతూ గతేడాది భారత్‌ పదే పదే చైనాకు చెందిన పలు మొబైల్‌ యాప్‌లను నిషేధించిందన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు, మార్కెట్‌ సూత్రాలను ఉల్లంఘించడాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. 
 
వివక్షతో కూడిన ఈ చర్యలను భారత్‌ సరిచేసుకోవాలని, తద్వారా ద్వైపాక్షిక సహకారానికి ముందుముందు నష్టం వాటిల్లకుండా చూడాలని కోరుతున్నట్టు చెప్పారు. గతేడాది భారత్‌-చైనా మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నేపథ్యంలో చైనాకు చెందిన టిక్‌టాక్‌ సహా అనేక యాప్‌లపై భారత్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. గతంలో జారీ చేసిన నోటీసులపై ఇచ్చిన వివరణ సరిగా లేకపోవడంతో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధాన్ని కొనసాగిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది.