ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జనవరి 2022 (15:50 IST)

ఒకే రన్‌ వే పైకి రెండు విమానాలు.. జడుసుకున్న ప్రయాణీకులు..?

భారత్‌కు వెళ్లే రెండు విమానాలు టేకాఫ్‌ కోసం ఒకే సమయంలో ఒకే రన్‌పైకి చేరడంతో పెను ప్రమాదం తప్పింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) అప్రమత్తం కావడంతో ఆ రెండు విమానాలు ఢీకొనే ముప్పు నుంచి తృటిలో తప్పించుకున్నాయి. దీంతో ప్రయాణీకులంతా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. గత ఆదివారం జనవరి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లే ఎమిరేట్స్ విమానం ఈకే-524 టేకాఫ్‌కు బయలుదేరింది. రన్‌ వే 30ఆర్‌ పైకి అది వేగంగా సమీపిస్తుంది. ఇంతలో దుబాయ్‌ నుంచి బెంగళూరు వెళ్లే మరో ఎమిరేట్స్ విమానం ఈకే-568 అదే రన్‌పై టేకాఫ్‌ కోసం వేగంగా వస్తుంది. దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ ఏటీసీ దీనిని తృటిలో గుర్తించింది. హైదరాబాద్‌ వెళ్లే విమానం టేకాఫ్‌ను వెంటనే నిలిపివేసింది.
 
అయితే ఆ విమానం అప్పటికే 130 నాట్ల వేగాన్ని అందుకుంది. ఏటీసీ ఆదేశంతో పైలట్లు వేగాన్ని తగ్గించారు. రన్‌వేకు 790 మీటర్ల దూరంలోని మరో లేన్‌కు మళ్లించి సురక్షితంగా నిలిపివేశారు. దీంతో రెండు విమానాలు దగ్గరగా వచ్చి ఢీకొనే ముప్పు తప్పింది.
 
తొలుత బెంగళూరు వెళ్లే విమానం ఏటీసీ క్లియరెన్స్‌ పొందడంతో టేకాఫ్‌కు బయలుదేరింది. అయితే ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వనప్పటికీ హైదరాబాద్‌ వెళ్లే విమానం కూడా షెడ్యూల్‌ సమయానికి టేకాఫ్‌కు బయలుదేరడంతో ఈ ఘటన జరిగింది. మరోవైపు యూఏఈకి చెందిన ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్ (ఏఏఐఎస్‌) ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది.