సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2019 (12:49 IST)

ఐపీఎల్‌లో 5వేల పరుగుల రికార్డు.. నో బాల్ పైన కోహ్లి ఫైర్....

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో టీమిండియా పరుగుల యంత్రం, కెప్టెన్ కోహ్లీ ఖాతాలో కొత్త రికార్డు వచ్చి చేరింది. ముంబయితో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 46 పరుగులు చేసి ఐపీఎల్‌లో ఐదు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌రైనా కోహ్లీ కన్నా ముందున్నాడు. 
 
రైనా 178 మ్యాచుల్లో 5034 పరుగులు చేయగా కోహ్లీ 165 మ్యాచుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. ముంబైతో గురువారం జరిగిన మ్యాచ్‌కు ముందు ఈ రికార్డుకు 46 పరుగుల దూరంలో వున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సరిగ్గా 46 పరుగులు చేసి 5000 క్లబ్‌లో చేరాడు. 
 
మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌శర్మ, హార్దిక్‌ పాండ్య మెరుపు బ్యాటింగ్‌తో బెంగళూరు ముందు భారీ లక్ష్యం నిర్దేశించింది. దీంతో లక్ష్య ఛేదనకు దిగిన కోహ్లీసేన 181 పరుగులు చేసి 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌తో ఈ సీజన్‌లో ముంబయి తన ఖాతాలో మొదటి విజయం నమోదు చేసుకుంది. బెంగళూరు రెండో ఓటమిని చవిచూసింది.
 
కానీ అంపైర్‌ తప్పిదానికి.. గెలిచే అవకాశమున్న బెంగళూరు మ్యాచ్‌ కోల్పోవాల్సి వచ్చిందని టాక్ వస్తోంది. మలింగ వేసిన 20వ ఓవర్‌ మొదటి బంతిని శివం దుబే సిక్స్‌గా మలచడంతో ఆశలు మరింత పెరిగాయి. ఆపై వరుసగా నాలుగు కట్టుదిట్టమైన బంతులేసిన మలింగ నాలుగు సింగిల్స్‌ ఇచ్చాడు. ఇక ఆఖరి బంతికి బెంగళూరుకు కావాల్సింది ఏడు పరుగులు. 
 
కాగా ఇక్కడే ఆట మలుపు తిప్పే సన్నివేశం జరిగింది. చివరి బంతిని మలింగ ఫుల్‌టాస్‌ వేయగానే శివం దాన్ని లాంగ్‌ ఆన్‌ దిశగా ఆడాడు. ఎలాగు మ్యాచ్‌ గెలవలేమని వారు పరుగులు తీయలేదు. దీంతో ముంబయి గెలుపు సంబరాల్లో తేలిపోయింది. అయితే రిప్లేలో మలింగ చివరి బంతిని నోబాల్‌గా వేశాడని తేలింది. అంపైర్‌ ఈ విషయాన్ని గుర్తించకపోవడంతో మ్యాచ్‌ ముగిసింది. ఈ విషయంపై కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మేం ఆడేది ఐపీఎల్.. గల్లీ క్రికెట్‌ కాదు. అంపైర్లు దీన్ని గమనించాల్సి ఉంది. ఉత్కంఠపోరులో ఇలాంటి తప్పిదాలు మంచిది కాదని మండిపడ్డాడు.