మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2019 (15:52 IST)

సోషల్ మీడియా ఖాతాలు ఆదార్‌తో అనుసంధానం : సుప్రీంలో పిటిషన్

ఇపుడు ప్రతిదానికి ఆధార్ ఆధారమైపోయింది. బ్యాంకు ఖాతాలకు, మొబైల్ నంబర్లు తీసుకునేందుకు, రేషన్ కార్డుకు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు, ఇలా ప్రతి దానికీ ఆధార్ ప్రధానంగా మారింది. ఇపుడు సోషల్ మీడియా ఖాతాలను కూడా ఆధార్‌తో అనుసంధాలించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. 
 
ఇటీవలికాలంలో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు, దూషణలు, పరస్పర ఆరోపణలు వంటి అవాంఛనీయ అంశాలు హెచ్చుమీరిపోయాయి. వీటి అడ్డుకట్టకు జనవరి 15 నాటికి సరికొత్త నియమావళికి కేంద్ర రూపకల్పన చేయనుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది. 
 
ఈ సరికొత్త నియమావళిలో రూపకల్పనలో భాగంగా సోషల్ మీడియా ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయం చర్చకు వస్తోంది. తద్వారా ఫేక్ ఐడీలను నిరోధించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, దీనిపై మధ్యప్రదేశ్, మద్రాసు, బొంబాయి హైకోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలు చేశారు.
 
అయితే, సోషల్ మీడియా నెట్వర్కింగ్ సంస్థలు అన్ని పిటిషన్లను ఒకే న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, దీనిపై మంగళవారం విచారణ జరిగింది. వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు తన ధర్మాసనం పరిధిలోకి బదిలీ చేయించింది. 
 
ఈ సందర్భంగా సోషల్ మీడియా కార్యకలాపాలను నియంత్రించేందుకు వీలుగా నియమావళి ఏర్పాటుపై తమకు జనవరిలో నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తమ ధర్మాసనానికి బదిలీ అయిన పిటిషన్లపై వచ్చే యేడాది జనవరి చివరి వారంలో విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది.