సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By కుమార్
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (18:12 IST)

నిషేధం ఎత్తివేసినా ప్లే స్టోర్‌లో కనిపించలేదంటున్న టిక్‌టాక్ ఫ్యాన్స్

నిషేధం విధించిన చైనా యాప్‌ ‘టిక్‌టాక్‌’ను అనుమతిస్తున్నట్లు మద్రాసు హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. అయినా కూడా ఈ యాప్ ఇప్పటికీ గూగుల్‌ ప్లే స్టోర్, ఆపిల్‌ యాప్‌ స్టోర్లలో యూజర్లకు అందుబాటులో లేదు. దీనిపై కోర్టు నుంచి తమకు మార్గదర్శకాలు వచ్చిన తర్వాత తాము ఆయా సంస్థలతో అధికారికంగా మాట్లాడతామని ఎలక్ట్రానిక్స్‌, సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖలోని ప్రతినిధులు మీడియాకు తెలియజేసారు. 
 
ఇలా ఉండగా ఈ యాప్‌పై తాము విధించిన నిషేధం కొనసాగుతుందని మద్రాసు హైకోర్టు ఇటీవల మరోసారి స్పష్టం చేసిన నేపథ్యంలో ఏప్రిల్‌ 3న కేంద్ర ఐటీ శాఖ గూగుల్‌ ప్లే స్టోర్, ఆపిల్‌ ఐఓఎస్ స్టోర్‌లలో ఈ యాప్‌లు లభ్యం కాకుండా చేయాలని ఆయా సంస్థలకు సూచించిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌లో ఆ రెండు యాప్‌ స్టోర్ల నుంచి ఇటీవలే ఈ యాప్‌ను తొలగించారు. 
 
స్మార్ట్‌ఫోన్‌లలో ప్రత్యేక ఫీచర్లతో యూజర్లు ఈ యాప్‌ ద్వారా వీడియోలను తీసుకునే వారు. వాటిని సోషల్ మీడియాలో షేర్‌ చేసేవారు. అయితే, వీడియో యాప్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని అభ్యంతరాలు వచ్చాయి. చిన్నారులను లక్ష్యంగా చేసుకుని లైంగిక నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపణలు వచ్చాయి.
 
టిక్‌టాక్‌ యాప్‌పై స్టే విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై తీర్పునివ్వాలంటూ మద్రాసు హైకోర్టుకు ఇటీవల సుప్రీంకోర్టు గడువు విధించింది. దీంతో చిన్నారులు, మహిళల అశ్లీల వీడియోలు అప్‌లోడ్‌ చేయకూడదనే ఆంక్షలతో ఈ యాప్‌పై ధర్మాసనం తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేసింది.