ఎన్నికల వేళ రూ.3439 కోట్లు స్వాధీనం చేసుకున్న ఈసీ
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరిగేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయగా, చివరి దశ పోలింగ్ ఈ నెల 19వ తేదీన జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ధన ప్రవాహం కొనసాగింది. ఎన్నికల నిబంధనలు అమలులోకి వచ్చిన రోజు నుంచి చివరి దశ ఎన్నికల ప్రచారం జరిగిన చివరి రోజు వరకు దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు 3439 కోట్ల రూపాయలను ఎన్నికల అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. గత 2014 ఎన్నికల్లో ఈ మొత్తం రూ.1200 కోట్లుగా ఉంది.
ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం డబ్బులో ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే రూ.950 కోట్లు పట్టుకున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అంటే, అత్యధిక డబ్బు సీజ్ చేసిన రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా.. రూ.552 కోట్లతో గుజరాత్ రెండో స్థానంలో నిలిచినట్లు ఈసీ పేర్కొంది.