మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 3 మే 2019 (13:24 IST)

మీ తాతలు.. ముత్తాతలు దిగిరావాలి : అరవింద్ కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ కేంద్ర మంత్రి విజయ్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలంటే మీ తాతలు, ముత్తాతలు దిగిరావాలంటూ హెచ్చరిక చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి విజయ్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ స్పందిస్తూ, మరి ఇంకెందుకు ఆలస్యం... మీరు ఎంత ఇస్తామన్నారు... వాళ్లు ఎంత అడుగుతున్నారు అంటూ ప్రశ్నించారు. పనిలోపనిగా ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని సెటైర్లు కూడా వేశారు. 
 
మోడీజీ... విపక్షాలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసి ప్రభుత్వాలను మార్చేస్తారా? అంటూ ప్రశ్నించారు. మీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని సూటిగా ప్రశ్నించారు. పైగా, ఇంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయంటూ నిలదీశారు. పైగా, ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు గతంలో అనేకసార్లు ప్రయత్నించారనీ ఆరోపించిన కేజ్రీవాల్... తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అంత సులభం కాదనీ, ఆపని జరగాలంటే మీ తాతలు, ముత్తాతలు దిగిరావాలని ఆయన జోస్యం చెప్పారు. 
 
కాగా, ఇటీవల వెస్ట్ బెంగాల్ పర్యటనలో కూడా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ తమతో 40 మంది ఎమ్మెల్యేలు టచ్‍లో ఉన్నారంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి హెచ్చరికలు చేసిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలను విపక్ష పార్టీల నేతలు ముక్తకంఠంతో ఖండించారు.