మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చు లేదా ఇవ్వకపోవచ్చు.. కానీ పరగణనలోకి తీసుకుంటాం : సుప్రీంకోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆయన బెయిల్ పిటిషన్‌పై 7వ తేదీన వాదనలు వింటామని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చు లేదా ఇవ్వకపోవచ్చు కానీ పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టులో ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌కు అవకాశం ఉందని, అయితే, తదుపరి తేదీనే విచారణ ముగుస్తుందని చెప్పలేమని పేర్కొంది. విచారణ ఈ రోజు పూర్తి చేయలేం. మంగళవారం ఉదయానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. విచారణకు సమయం పడుతుందంటే వాదనలను బట్టి మధ్యంతర బెయిల్ గురించి ఆలోచించవచ్చని తెలిపింది. ఎన్నికల నేపథ్యంలో మీ వాదనలు వింటామని కేజ్రీవాల్‌కు తెలిపింది. మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చు.. ఇవ్వకపోవచ్చు.. కానీ పరిగణనలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.