శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2021 (15:06 IST)

రైతుల విషయంలో అంత అహం పనికిరాదు.. సోనియా గాంధీ ఫైర్

రైతుల విషయంలో ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరించిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. శుక్రవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ సమావేశంలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతుల ఆందోళనలతో పాటు కరోనా మహమ్మారిపై ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. 
 
దేశంలో వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం అగ్రి చట్టాలను తెచ్చిందన్నారు. రైతుల పట్ల కేంద్రం వైఖరి అహంకారపూరితంగా ఉందని విమర్శించారు. కేంద్రం హడావుడిగా తీసుకొచ్చిన ఆ మూడు చట్టాలపై కనీసం పార్లమెంటులో చర్చకు కూడా అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. జాతీయ భద్రత విషయంలోనూ పూర్తిగా రాజీ పడుతోందని అన్నారు. అర్నబ్ లీక్స్పై ప్రభుత్వం తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
 
మే 29న ఏఐసీసీ సమావేశం నిర్వహించి కాంగ్రెస్ నూతన అధ్యక్షుని ఎన్నిక చేపట్టాలని సీడబ్ల్యూసీ సమావేశంలో నాయకులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మే 15వ తేదీ నుంచి మే 30వ తేదీ మధ్య ఆ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఫిబ్రవరిలోనే పార్టీ అంతర్గత ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మేలో జరిగే ప్లీనరీ సమావేశాల్లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది.