ఆగస్ట్ 5 రామభక్తులంతా ఇళ్ళలో భజనలు చేయండి: విశ్వ హిందూ పరిషత్ పిలుపు

ramajanma bhoomi
ఎం| Last Updated: గురువారం, 30 జులై 2020 (16:52 IST)
అయోధ్య రామమందిర భూమిపూజ కార్యక్రమ రోజైన ఆగస్ట్ 5 ఉదయం 10.30 లకు రామభక్తులంతా తమతమ ఇళ్ళలో, ఆశ్రమాలు, దేవాలయాలు మొదలైన ప్రదేశాల్లో భజన చేసి ఆరతి సమర్పించి ప్రసాద వితరణ చేయవచ్చని విశ్వహిందూ పరిషత్ సెక్రెటరీ జనరల్ మిళింద్ పరండే పిలుపునిచ్చారు.

"శ్రీరామజన్మభూమిలో భవ్య మందిర నిర్మాణం కోసం జరిగే భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాల కోసం దేశం మొత్తం నుంచి వందలాది నదుల నీళ్ళు, అనేక పవిత్ర, పుణ్య స్థలాలకు చెందిన మట్టి అయోధ్యకు చేరుతున్నాయి. ఈ అపూర్వమైన కార్యం మన దేశపు సాంస్కృతిక జాతీయవాదాన్ని, ఏకాత్మ మానవవాదాన్ని, జాతీయ సమీక్యత, సమగ్రతలను మన కళ్ళముందు ఉంచుతుంది’’ అని మిళింద్ పరండే అన్నారు.

అహల్య శాపవిమోచనం, శబరి అతిధ్యం స్వీకరించడం, నిషాదరాజు(గుహుడు)తో స్నేహం వంటివి భగవాన్ రాముని జీవితంలో సామాజిక సమరసతకు సంబంధించిన అద్భుతమైన ఉదాహరణలని మిళింద్ అన్నారు.

1989లో షెడ్యూల్ కులానికి చెందిన కామేశ్వర్ చౌపాల్ అనే యువకుడు వందలాదిమంది సాధుసంతుల దివ్య సమక్షంలో రామజన్మ భూమి భూమి పూజను తన కరకమలాలతో ప్రారంభించారని, ఆయన ఇప్పుడు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ లో ముఖ్యమైన ట్రస్టీ గా కొనసాగుతున్నారన్నారు.

అయోధ్య శ్రీ రామమందిర భూమి పూజకు వేలాది పుణ్య క్షేత్రాలకు చెందిన మట్టి, పవిత్ర నదీజలాలను సేకరించిన పంపిన ప్రజల, కార్యకర్తల ఉత్సాహం, శ్రద్ధ అపూర్వమైనవని ఆయన అన్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభమయిన నాగపూర్ మట్టితోపాటు సంత్ రవిదాస్ నడయాడిన కాశీ, మహర్షి వాల్మీకి ఆశ్రమం ఉన్న సీతామర్హి, విదర్భ(మహారాష్ట్ర)లోని గొండియా జిల్లాలోని కచర్ గడ్, జార్ఖండ్ లోని రామ్ రేఖంధం, మధ్యప్రదేశ్ లోని తాంత్య భీల్ పవిత్ర స్థలం, అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయం, మాహులో డా. అంబేడ్కర్ జన్మస్థలం, మహాత్మా గాంధీ 72 రోజులపాటు నివసించిన న్యుడిల్లీ లోని వాల్మీకి దేవాలయం, అలాగే అక్కడే ఉన్న జైన్ లాల్ మందిరం మొదలైన ప్రదేశాల నుంచి మట్టిని సేకరించి పంపారని తెలియజేశారు.

"దూరదర్శన్ లో అయోధ్య రామమందిర భూమిపూజ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని సమాజంలో అందరికీ చూపించడానికి ఏర్పాటు చేయాలి. ఇళ్ళు, దేవాలయాలు, ఆశ్రమాలు, గురుద్వారాలు, గ్రామాలు, మార్కెట్ లు మొదలైన ప్రదేశాలన్నీ అందంగా అలంకరించాలి. సాయంత్రం దీపాలు వెలిగించాలి. రామమందిర నిర్మాణం కోసం ఇతోధికంగా విరాళాలు అందిస్తామని ప్రతిజ్ఞ చేయాలి.

రామమందిర భూమిపూజ కార్యక్రమం గురించి సమాజంలో ఎక్కువమందికి తెలిసే విధంగా రామభక్తులు ప్రచారం చేయాలి. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నప్పుడు కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి" అని సూచించారు.దీనిపై మరింత చదవండి :